హైదరాబాద్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో కొందరు నేతలు అసభ్యకరమైన భాషలో దూషణలకు పాల్పడుతున్నారని, ఇటువంటి వారిని అదుపు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి సూచించింది. కారును పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తిచేసింది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేందుకు తమ పార్టీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఎన్నికల సంఘం అధికారులతో చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్‌గోయల్, ఇతర ఉన్నతాధికారుల బృందం మంగళవారం హైదరాబాద్ వచ్చింది. హోటల్ తాజ్ కృష్ణాలో ఆ బృందం జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో విడివిడిగా భేటీ అయ్యింది. బీఆర్ఎస్ తరఫున బీ వినోద్‌కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్‌కుమార్ గుప్తా హాజరయ్యారు. ఎంఐఎం, ఆప్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, ఇతర పార్టీల ప్రతినిధులు కూడా ఎన్నికల అధికారులను కలుసుకున్నారు.
ఎన్నికల అధికారులతో భేటీ అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు కారు గుర్తును కేటాయించిన 2004 నుంచి 2019వరకు జరిగిన వివిధ ఎన్నికలలో కారు గుర్తుకు వచ్చిన ఓట్లు, కారును పోలి ఉన్న గుర్తులకు వచ్చిన ఓట్ల వివరాలను అధికారులకు వివరించామని తెలిపారు. తమ పార్టీ విజ్ఞప్తి మేరకు గతంలో ఆటో, ట్రక్కు గుర్తులను, 2011లో రోడ్ రోలర్ గుర్తును తొలగించారని తెలిపారు. కారును పోలిన అన్ని గుర్తులను జాబితా నుంచి తొలగించాలని కోరామని చెప్పారు. యుగ తులసి పార్టీకి కేటాయించిన రోడ్ రోలర్ గుర్తును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేకంగా ఈవీఎంలను ఏర్పాటుచేయాలని కోరామని, దీని ద్వారా జాతీయ, పార్టీల గుర్తులను పోలిన గుర్తులతో సమస్యలు రావని అన్నారు.
ఎన్నికల సమయంలో కొందరు నాయకులు.. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలపై సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ చానెల్స్‌లో అసభ్యంగా, దూషిస్తూ మాట్లాడుతున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి వారిని అదుపు చేయాలని సీఈసీని కోరినట్టు వినోద్‌కుమార్ చెప్పారు. తమ రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తున్నారని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రముఖుల కుటుంబ సభ్యులపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల సంఘం స్పందించాలని కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. రాష్ట్రంలో కొందరు మత చాంధసవాదులు పరిధి దాటి మాట్లాడుతున్నారని, ఇది శాంతి భద్రతల సమస్యలకు దారి తీస్తున్నదని, సున్నితమైన అంశాలను రెచ్చరొట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని వీరిపై ఓ కన్నేసి ఉంచాలని కోరామని తెలిపారు.
ఎన్నికల్లో ప్రచార సామగ్రి ధరలు అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉండేలా చూడాలని కోరామని వినోద్‌కుమార్ తెలిపారు. పెట్రోల్, డిజిల్, ఇతర వస్తువులు, సామగ్రి ధరలు పెరిగినందున అభ్యర్థుల ఎన్నికల ఖర్చును మరో రూ.20 లక్షలు పెంచాలని కోరామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు నాయకులు ఉపయోగించే జెండాలు, టోపీలు, టీ షర్ట్ల ఖర్చులను ప్రతిరోజు కొత్తగా కొనుగోలు చేసినట్టు వాటిని ఖర్చు పరిధిలోకి తీసుకొస్తున్నారని, దీనిపై అభ్యంతరం తెలిపామని చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే మార్గదర్శకాల పుస్తకాలను హిందీ, ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంచాలని వినోద్‌కుమార్ సూచించారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా జరిగేలా చూడాలని, ఇందుకు తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్చగా, ప్రశాంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.