హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : తనిఖీలలో భాగంగా పట్టుబడుతున్న ఎన్నికల తాయిలాలు, బహుమతులను ఆయా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులోనే కలపాలని కేంద్రం ఎన్నికల బృందం రాష్ట్ర సీఈవోను ఆదేశించింది. నగదు విషయంలో సాక్ష్యాధారాలుంటే ఉదాసీనంగా వ్యవహరించాలని స్పష్టంచేసింది. అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల తరలింపును అడ్డుకోవడానికి ఆధునిక పద్ధతుల్లో ఆలోచించాలని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సూచించింది.
నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం పనితీరుపై కేంద్రం ఎన్నికల సంఘం అధికారుల బృందం మరోసారి సమీక్షించింది. ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు, 1950, సువిధ, సీ-విజిల్, ఈఎమ్ఎమ్‌సీ పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ను ఇప్పటికే ఏర్పాటు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా తుది సవరణల తర్వాత పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఓటరు కార్డుల పంపిణీ, ఓటర్ల సమాచార స్లిప్‌ల విషయంలో తాజా పరిస్థితిని బృందం అధికారులు అడిగి తెలుసుకొన్నారు.
ఎంసీఎంసీ సర్టిఫికెట్లను రోజువారీగా జారీచేయాలని ఆదేశించారు. కీలక పోలింగ్‌కేంద్రాల్లో నిఘా కెమెరాల ఏర్పాటు పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్రశర్మ, నితేశ్‌కుమార్ వ్యాస్, ప్రిన్సిపల్సెక్రటరీ అవినాశ్‌కుమార్ అడిగి తెలుసుకొన్నారు. ఇంటివద్ద నుంచే ఓటు వేయాలనుకొనే సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్దేశిత ఫారాలను ముందుగానే అందజేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఎస్సీఎస్ సునీల్ శర్మ, రవాణా ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, ఏడీజీపీ, ఎన్నికల వ్యవయ పరిశీలన నోడల్ అధికారి మహేశ్ భాగవత్, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి సంజయ్ జైన్, వివిధ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.