హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): వచ్చే సాధారణ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలోని సగం పోలింగ్ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో పోలీసు శాఖ నిమగ్నమైంది. ఈసారి వెబ్ క్యాస్టింగ్ స్థానంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నది. ఈ సీసీ కెమెరాలతో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని సీఈవో కార్యాలయం నుంచి ఓటింగ్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ విధానాన్ని ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఉపయోగించడంతో విజయవంతమైం ది. రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రా లు ఉండగా, 18 వేల వరకు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా ఆకర్షించడానికి స్థానిక సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా అలకంరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన జీహెచ్ఎంసీలోని మూడు జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు, 24 ఎలక్ట్రోరల్ రీజిస్ట్రేషన్ ఆఫీసర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 19వ తేదీలోగా పరిష్కరించాలని చెప్పారు. మరణించినవారు, వలస వెళ్లినవారి వివరాలను సేకరించి పరిష్కరించాలని సూచించారు.