హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలుపై తెలంగాణ సర్కారు విచిత్ర వైఖరిని అవలంబిస్తున్నది. సాధారణంగా దేశంలోని ఏరాష్ట్రంలోనైనా కోడ్ అమలు తీరు ఒకేలా ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఒకే రోజు ప్రారంభమైన స్కీమ్ల అమలులో ప్రభుత్వం ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్నది. రైతుభరోసాకు కోడ్ మినహాయింపు ఉన్నదని చెబుతున్నది. కానీ ఆత్మీయ భరోసాకు మాత్రం కోడ్ వర్తిస్తుందని బుకాయించడమేంటని లబ్ధిదారులు మండిపడుతున్నారు.
జనవరి 26 నుంచి రైతుకూలీల ఖాతాల్లో ఆత్మీయ భరోసా కింద రూ.6వేల చొప్పున జమచేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని కొందరికి సాయం అందజేసింది. తెల్లారే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో పథకాన్ని నిలిపివేసింది. నియావవళి వర్తించని గ్రామాల్లోనూ అమలుచేయలేదు. రైతుభరోసాను కోడ్ అమల్లో ఉన్న జిల్లాల్లో వర్తింపజేస్తున్న ప్రభుత్వం ఆత్మీయ భరోసా విషయంలో భిన్నంగా వ్యవహరించడమేంటని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖజానాలో నిధులులేకపోవడంతోనే ఈ పథకం అమలుపై జాప్యం చేస్తున్నదని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.