ములుగు(నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 29/మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు కారణంగా మండలంలోని 14 ఎంపీటీసీలు, 25 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, 230 వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. 2006కు ముందు మంగపేటలోని 18 పంచాయతీల్లో రొటేషన్ పద్ధతిలో స్థానిక ఎన్నికలు జరుగుతూ వచ్చా యి. 2006లో మండలం మొత్తాన్ని షెడ్యూ ల్డ్ ప్రాంతంగా పరిగణించి 18 జీపీలను ఎస్టీలకే కేటాయించగా గిరిజనులు ఐదేండ్లుగా సర్పంచ్‌లుగా కొనసాగారు. అయితే 2013 లో రొటేషన్ పద్ధతిలో ఎంపీటీసీ ఎన్నికలు జరగగా, గిరిజనులు హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి ఎంపీపీ ఎన్నికను అడ్డుకున్నారు.
దీంతో గిరిజనేతరులు 2014లో మంగపేట షెడ్యూల్డ్ ఏరియా కాదని హైకోర్టును ఆశ్రయించినా పిటిషన్లు తిరస్కరణకు గురయ్యా యి. సుదీర్ఘ విచారణ అనంతరం 2023 జూలై 5న మంగపేట మండలం షెడ్యూల్డ్ ప్రాంతమేనని, 23 గ్రామాలు షెడ్యూల్డ్ పరిధిలోకే వస్తాయని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. గిరిజనేతరులు ఈ తీర్పును సవాలు చేస్తూ 1950లో రాష్ట్రపతి జారీచేసిన షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్డర్లో మంగపేటలోని 23 గ్రామాలు లేవని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, వాదనలు విన్న కోర్టు 23 గ్రామాలను షెడ్యూల్డ్ ట్రైబ్‌గా పరిగణించొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఈ కేసు తదుపరి విచారణ 2026 ఫిబ్రవరి 16న ఉన్నట్టు సమాచారం. 15 ఏండ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం, ప్రస్తుతం కూడా నిర్వహించబోమని ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు నిరాశ చెందుతున్నారు.