Patancheru | సిద్దిపేట, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఉప ఎన్నిక చిచ్చు రాజేస్తున్నది. అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరుకు ఉప ఎన్నిక ఆజ్యం పోసేలా ఉన్నది. పటాన్చెరు టికెట్ కోసం నలుగురు ముఖ్య నాయకుల మధ్య పోరు పతాక స్థాయిలో ఉన్నది. టికెట్ తమకంటే తమకేనంటూ ఒకరిపై మరొకరు ఎత్తులు, పైఎత్తులతో కత్తులు దూసుకుంటున్నారు. ఎవరికి వారు ఇప్పటికే తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలిసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయక తప్పదని న్యాయనిపుణులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ 10 నియోజకవర్గాల్లో ఒకటైన పటాన్చెరులో కూడా ఉప ఎన్నిక దాదాపుగా ఖాయమైనట్టేనని చెప్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్‌రెడ్డి ఎన్నికల అనంతరం ఫ్లేట్ ఫిరాయించారు. బీఆర్ఎస్ను వీడిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై వేటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్నది.
పటాన్చెరులో కొన్నేండ్లుగా ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కాట శ్రీనివాస్‌గౌడ్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. 2018, 2023 ఎన్నికల్లో ఈ ఇద్దరే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఈ రెండు ఎన్నికల్లోనూ కాట శ్రీనివాస్‌గౌడ్‌పై గూడెం మహిపాల్‌రెడ్డి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఇద్దరి మధ్య నువ్వా, నేనా అనేలా పోరు జరిగింది. కేవలం 7,091 ఓట్ల మెజార్టీతో గూడెం బయటపడ్డారు. నాడు, నేడు కాట శ్రీనివాస్ వర్గీయులపై ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వేధింపులతో వారి మధ్య రాజకీయవైరం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్‌గౌడ్ రగిలిపోయారు. వాస్తవానికి మహిపాల్‌రెడ్డి చేరికను శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అధిష్టానం నిర్ణయంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇప్పటికీ మహిపాల్‌రెడ్డి చేరికను ఆయన జీర్ణించుకోవడం లేదని తన వర్గీయులే చెప్తున్నారు. ఇన్నాళ్లు తనను, తన వర్గీయులను వేధింపులకు గురిచేసి ఇప్పుడు పార్టీలో చేరడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే.. గూడెం మహిపాల్‌రెడ్డిపై ప్రతీకారం తీర్చుకునేందుకు శ్రీనివాస్‌గౌడ్ వేచి చూస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో ఆయనకు చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా నియోజవర్గంలో ప్రచారం జరుగుతున్నది.
పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట నడుస్తున్నది. ఉప ఎన్నిక వ్తే ‘ఆ నలుగురు’ మధ్య తీవ్రమైన పోటీ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ఇప్పటికే మొదలుపెట్టారు. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కాట శ్రీనివాస్‌గౌడ్, నీలం మధు, గాలి అనిల్‌కుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. గత ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన నీలం మధు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి పటాన్చెరు టికెట్ ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో బీఎస్పీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ నుంచి జహీరాబాద్ ఎంపీగా పోటీచేసి ఓడిపొయిన గాలి అనిల్‌కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ మొదలు పెట్టినట్టుగా తెలిసింది. ‘రియల్’ కింగ్‌గా పేరొందిన ఓ నేత ఢిల్లీకి మూటలు ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ‘ఎంత కావాలంటే అంత ఇస్తా. నాకు మాత్రం టికెట్ కావాల్సిందే. అసెంబ్లీలో నేను అధ్యక్షా అనాల్సిందే’నని కోరుకుంటున్నట్టు తెలిసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. ఇన్నాళ్లు బీఆర్ఎస్లో ఉంటూ అధికారం అనుభవించి ఇప్పుడు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీలోకి రావడంపై వారు రగిలిపోతున్నట్టుగా తెలిసింది. గూడెం చేరికతో ఆయన అనుచరులకు, పాత కాంగ్రెస్ నేతల మధ్య పలుమార్లు రచ్చ జరిగింది. దీంతో ఇరువర్గాలకూ పొసగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే అసలు కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ ఎన్నికల్లో గూడెంను పక్కనపెట్టి అసలు కాంగ్రెస్ నేతను గెలిపించుకోవాలని వారంతా భావిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి ఎట్టిపరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. తమ అభిప్రాయానికి విరుద్ధంగా గూడెంకు టికెట్ ఇస్తే ఆయన్ను ఓడించి తీరుతామంటూ శపథం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తద్వారా అధిష్టానానికి హెచ్చరికలు పంపినట్టుగా తెలిసింది. వాస్తవానికి గూడెం మహిపాల్‌రెడ్డి, నీలం మధు, గాలి అనిల్ కుమార్ వలస కాంగ్రెస్ నేతలేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓడినా ఒక్క కాట శ్రీనివాస్‌గౌడ్ మాత్రమే కాంగ్రెస్‌ను అంటిపెట్టుకొని ఉన్నారు. అదే విధంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా అక్రమ మైనింగ్, క్రషింగ్‌కు సంబంధించి ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ప్రజల బాగోగులను మర్చిపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరాక ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి చేసిందేమీ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.