ఈ అవ్వపేరు బొంరాసు అంజిలమ్మ. ఏడాది కిందట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆమె పాత ఇంటిని కూల్చి, అక్కడే ఇల్లు నిర్మాణం మొదలుపెట్టారు. కాంట్రాక్టర్ బేస్మెంట్ వరకు పనులు పూర్తిచేసి బిల్లులు తీసుకున్నారు. ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. అడిగితే ఏవేవో కారణాలు చెప్తున్నారు అధికారులు. ఉన్న ఇంటిని కూలగొట్టుకొని, నిలువ నీడలేక అల్లాడుతున్నది అంజిలమ్మ. దిక్కులేని స్థితిలో బాత్రూమ్లోనే నివాసం ఉంటున్నది. బేస్మెంట్ వరకు కట్టి, మధ్యలోనే వదిలేశారని.. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె కుమారుడు వాపోతున్నారు. అంజిలమ్మ ఒక్కరే కాదు ప్రభుత్వ దత్తత గ్రామం చెంచుపెంటలో అనేకమంది పరిస్థితి ఇదే.
వికారాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం వికారాబాద్ జిల్లాలో ‘పేరు గొప్ప ఊరు దిబ్బ‘లా తయారైంది. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామంటూ అధికారులు హడావుడిగా ప్రచారం చేసి, అనేక మంది నిరుపేదలను రోడ్డున పడేశారు. ఉన్న పాత ఇండ్లను కూల్చివేయించి, కొత్త ఇల్లు నిర్మాణం మధ్యలో ఆపేయడంతో అనేక కుటుంబాలు నిలువ నీడ కోల్పోయి, బాత్రూమ్లలో తలదాచుకుంటున్నాయి. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు పూడూరు మండలం ఎన్కెపల్లి అనుబంధ గ్రామమైన చెంచుపల్లిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆదర్శగ్రామంగా ప్రకటించారు. గ్రామానికి ఏడాది కిందట మొత్తం 48 ఇండ్లు మంజూరయ్యాయి. చెంచుపల్లిలో ఉండేవారంతా నిరుపేద చెంచు కుటుంబాలు కావడంతో తామే ఇండ్లను నిర్మించి ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే, అధికారులు హామీనిచ్చారు. దీంతో సంబురపడిన చెంచుపల్లి గ్రామస్తులు శిథిలావస్థలో ఉన్న చిన్నపాటి ఇండ్లను కూల్చేశారు. ఆ స్థానంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ బాధ్యతలను అధికారులు ఒక కాంట్రాక్టర్కు అప్పగించారు. మొదటి దశలో బేస్మెంట్ వరకు పూర్తిచేసిన తర్వాత.. సదరు కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. బిల్లులు వసూలు చేసుకొని ముఖం చాటేశారని స్థానికులు చెప్తున్నారు. ఫలితంగా ఏడాది గడిచినా 48 ఇండ్లల్లో ఒక్కటి కూడా పూర్తికాలేదని అంటున్నారు.
ఇందిరమ్మ ఇల్లుపై ఆశతో గతంలో ఉన్న చిన్నపాటి ఇండ్లను కూల్చివేయడంతో అనేక కుటుంబాలు బాత్రూమ్ల్లో, గుడిసెల్లో తలదాచుకుంటున్నాయి. చిన్నచిన్న కారణాలు చూపి పనులు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ ముఖం చాటేశాడని, ఊరివైపే చూడటం లేదని స్థానికులు వాపోతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని ఏడాదిగా అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నివిస్తున్నా పట్టించుకోవడం లేదని చెంచు కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిరుడు మంజూరైన ఈ ఇండ్లను ప్రభుత్వం నాన్స్టార్టెడ్ కింద పెట్టినట్టు సమాచారం. దీంతో కొత్తగా మళ్లీ కలెక్టర్ నుంచి అప్రూవల్ రావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు కల్పించుకొని తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఏడాది కిందట మా అమ్మ పేరుమీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో ఉన్న ఇల్లును కూల్చివేయమని అధికారులు చెప్పడంతో కూల్చేశాం. కాంట్రాక్టర్ బేస్మెంట్ వరకు పనులు పూర్తిచేసి బిల్లులు తీసుకున్నారు. మిగ తా పనులు పూర్తిచేయాలని అడిగితే మా అమ్మ ఫింగర్ ప్రింట్స్ రావడంలేదని, పనులు కొనసాగించలేమని చెప్తున్నారు. ఏడాది కాలంగా మా అమ్మ బాత్రూమ్లోనే నివాసం ఉంటున్నది.
మా ఇల్లు బేస్మెంట్ వరకు నిర్మిం చి సంవత్సరం అయ్యింది. ఇప్పటివర కు కాంట్రాక్టర్ ఊరువైపు చూడ లేదు. విద్యుత్తు లైన్ ఉందనే కారణంతో పనులు నిలిపివేశారు. నిర్మాణం మొదలుపెట్టే సమయంలో లైన్ కనిపించలేదా? ఏడెనిమిది నెలలుగా విద్యుత్తు అధికారులు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఉన్న ఇల్లును కూల్చివేసి, మా ఇంటిల్లిపాది బాత్రూమ్లోనే ఏడాదిగా ఉంటున్నాము.

ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఏడాది కిందట ఇల్లు కూల్చివేశాము. అయితే ప్రొసీడింగ్లో ఇంటిపేరు తప్పుగా పడిందని ఇల్లును నిలిపివేశారు. ఆధార్ కార్డులో జుబ్బురు పుష్పమ్మ అని ఉండగా, ప్రొసీడింగ్లో జె.పుష్పమ్మ అని వచ్చింది. దీంతో తప్పుగా ఉందంటూ మంజూరైన ఇల్లును రద్దు చేశారు. గతేడాదిగా ఇంటి స్థలంలోనే గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నాం.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఆదర్శ గ్రామమంటూ ఇండ్లను మంజూరు చేశారు. ఇండ్ల నిర్మాణాన్ని కాంట్రాక్టర్కు అప్పజెప్పారు. ఇప్పుడు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే చెంచుపల్లిలో ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇండ్లను పూర్తి చేయకొంటే బాధితులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తాము.