చివ్వెంల, మే 2 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమరగాని అబ్బులు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొంగల రామలింగయ్య తమ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని అక్కలదేవిగూడెంకు చెందిన వృద్ధ దంపతులు కొంగల రాములు- లచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా భూమిని అమ్ముకోనివ్వండి, లేదా చావడానికి అవకాశం ఇవ్వండి’ అంటూ పురుగులమందు డబ్బాతో నిరసన వ్యక్తంచేసిన ఘటన శనివారం గ్రామంలో చోటుచేసుకున్నది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బండమీదిచందుపట్ల రెవెన్యూ శివారులోని 264 సర్వేనంబర్‌లో తమకు 1.06 ఎకరాల భూమి ఉన్నదని చెప్పారు.
అనారోగ్యం, అప్పుల కారణంగా భూమిని విక్రయించుదామనుకుంటే అమరగాని అబ్బులు, కొంగల రామలింగయ్య తదితరులు అమ్ముకోనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కన్నీటిపర్యంతమమ్యారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి అండదండలు ఉన్నాయని, ఎవరేం చేసుకుంటారో చేసుకోండంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారం క్రితమే షుగర్ వ్యాధి కారణంగా తన కాలి వేలు తొలగించారని, తన భార్య పక్షవాతంతో ఇబ్బందులు పడుతోందని కొంగల రాములు ఆవేదన వ్యక్తంచేశారు. గత నెల 6న కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, 20న ఎస్పీ నర్సింహకు ఇచ్చిన ఫిర్యాదులో తమకు ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని కోరినట్టు తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూమిని అమ్ముకుంటుంటే అడ్డుపడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ కుటుం బం మొత్తం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.