హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ): పోలవరం జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులను వెంటనే నిలుపుదల చేయాలని, ఆ దిశగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన కొత్త ఎత్తిపోతల పథకం పోలవరం ప్రాజెక్టు టీఏసీ నిబంధనలను ఉల్తంఘిస్తున్నదని వెల్లడించింది. అదీగాక కొత్త ఎత్తిపోతల పథకం వల్ల ఇప్పటికే ఉన్న గోదావరి డెల్టా సిస్టమ్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర జల్‌శక్తి శాఖ ఇప్పటికే అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసిందని, కొత్త ఎత్తిపోతల పథకం పనులను నిలిపేయాలని ఏపీని ఆదేశించిందని తెలంగాణ సర్కారు ఈ సందర్భంగా గుర్తుచేసింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం కేంద్ర ఆదేశాలను బేఖాతర్ చేస్తూ పనులను కొనసాగిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆక్షేపించింది. ఇటీవల పోలవరం ప్రాజెక్టు క్షేత్రపర్యటనకు వెళ్లిన కేంద్ర అధికారులు సైతం దీనిని గుర్తించారని, పనులను నిలిపేయాలని ఆదేశించారని తెలిపింది. అందుకు సంబంధించిన వార్తలు కూడా పత్రికల్లో వచ్చాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో జీఆర్ఎంబీ వెంటనే జోక్యం చేసుకుని ఏపీ సర్కారు కొనసాగిస్తున్న ఎత్తిపోతల పనులను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేఖతో పాటు కొత్త ఎత్తిపోతల పథకంపై పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా జతచేసి పంపింది.
‘నిప్పులవాగు’ విస్తరణ ఆపాలంటూ కేఏఆర్ఎంబీకి లేఖ
నిప్పులవాగు ఎస్కేప్ చానల్ విస్తరణ పనులు చేపట్టకుండా ఏపీని నిలువరించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ సర్కారు సోమవారం లేఖ రాసింది. ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించిందని, వెంటనే జోక్యం చేసుకోవాలని కేఆర్ఎంబీ చైర్మన్‌కు రాసిన లేఖలో రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. ఏపీ సర్కారు ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి బనకచర్ల క్రాస్కాంప్లెక్స్ వరకు 16.4 కిలోమీటర్ల పొడవున్న ఎస్ఆర్ఎంసీ ప్రవాహ సామర్థ్యాన్ని 88 వేల క్యుసెక్కులకు విస్తరించాలని నిర్ణయించి, గతంలోనే జీవో 203ను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఏపీ సర్కారు జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ తదితర ప్రాజెక్టులను కూడా విస్తరించాలని నిర్ణయించగా ఆయా పనులపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసిందని వెల్లడించారు. బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ, నిప్పుల వాగు ఎస్కేప్ చానల్‌ను అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలని ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖకు విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. ఏపీ చేపట్టనున్న ఆయా ప్రాజెక్టుల విస్తరణ వల్ల కృష్ణా బేసిన్‌కు తీరని నష్టం వాటిల్లుతుందని, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నీటి నిల్వపైనా తీవ్ర ప్రభావం పడుతుందని, తద్వారా తెలంగాణకు నష్టం కలుగుతుందని వివరించారు. ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.