హైదరాబాద్ : దక్షిణాది పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో ఐదురోజుల పాటు పర్యటించనున్న దృష్ట్యా అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని రామప్ప, భద్రాచలంతో పాటు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బీఆర్కేఆర్ భవన్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విడిది కోసం ఏర్పాట్లకు సంబంధించిన విషయాలపై చర్చించారు. రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని, ఈ మేరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాష్టప్రతి మార్గంలో రోడ్డు మరమ్మతులు, బారికేడింగ్ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు సీఈవోలను ఆదేశించారు. పోలీసు శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రపతి నిలయంలో ప్రొటోకాల్ అనుసరించి 24 గంటల పాటు విద్యుత్తు శాఖ, వైద్య బృందాలను నియమించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా కన్హాశాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు రామచంద్ర మహారాజ్ 150వ జయంతి ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారని సోమేశ్ కుమార్ తెలిపారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి నుంచి లక్ష మందికి పైగా యాత్రికులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, శాఖల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.