హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంపైనా ఎల్ నినో ప్రభావం చూపుతున్నది. ఈ ఏడాది ఆశించిన వానల్లేక సగం చెరువులు, కుంటలు వెలవెలబోతుండటం మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నది. ఇప్పటికే జిల్లాలవారీగా టెండర్లు వేసి కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ నీటి వనరుల పరిస్థితి కారణంగా చేప పిల్లల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. నిరుడు రా ష్ట్రంలో 30,134 చెరువుల్లో చేప పిల్ల లు పంపిణీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ నీటి సదుపాయం ఉన్న 13,353 చెరువుల్లో మాత్రమే విడుదల చేశారు. ఈసారి కూడా అవే చెరువులను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇటీవల కురిసిన వానలు ఉత్తర తెలంగాణకు కొంత ఊరట ఇచ్చినా, దక్షిణ తెలంగాణకు మాత్రం ఆశించిన మేర కురువలేదు. గతంలో నీటి మట్టాలతో సంబంధం లేకుండా జాబితాలో ఉన్న అన్ని చెరువుల్లోనూ చేప పిల్లలను వదిలేవారు. కానీ ఈ సారి ఎల్ నినో దెబ్బకు 50శాతానికి పైగా జలాశయాలు, చెరువులు అడుగంటిపోయాయి. నీటి చుక్కలేని చెరువుల్లో ఎలా విడుదల కేటాయిస్తారనేది స్పష్టం కావాల్సి ఉన్నది. 32 జిల్లాలకు సంబంధించి 140మందికి పైగా కాంట్రాక్టర్లు టెండర్లు వేసినట్లు సమాచారం. వానకాలం అదను దాటిపోతుండటంతో, నీరు ఉన్న చెరువుల్లో త్వరగా చేపపిల్లలను సరఫరా చేయకపోతే ఎదుగుదల తగ్గి నష్టపోతామని మత్స్యపారిశ్రామిక సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎండిన చెరువుల్లో సైతం చేపలు వేసినట్టు కాగితాల్లో చూపించి రూ.కోట్లు మింగేసినట్టు ఆరోపణలున్నాయి.
చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ కసరత్తు చేస్తున్నా.. కలెక్టర్ల నుంచి వివరాలు అందలేదని తెలిసింది. ఆయా జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో ఎంత శాతం నీరు ఉన్నదనే సమాచారం అందలేదు. చేపపిల్లలు పోస్తే ఏమేరకు పెరుగుతాయి?, మత్స్యకారుల జీవనోపాధి లభిస్తుందనే వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరినా ఇప్పటివరకు టీ మత్స్య యాప్లో ఆ వివరాలను అప్లోడ్ చేయలేదు.