చేర్యాల, అక్టోబర్ 26: కాపీ కొట్టి పరీక్ష రాసినందుకు హెచ్ఎం మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. చేర్యాల మండలం శభాష్గూడేనికి చెందిన గాడిపల్లి నర్సింహులు కుమారుడు మనోజ్ (13) స్థాని క వికాస్ గ్రామర్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం జరిగిన పరీక్షలో మనోజ్ సెల్‌ఫోన్ తెచ్చి అందులో జవాబులు చూస్తూ కాపీ కొట్టడంతో టీచర్ గమనించి హెచ్ఎం ఎలియాస్కు విషయాన్ని తెలిపారు. హెచ్ఎం వెంటనే మనోజ్ నుంచి సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. మనోజ్ పరీక్షకు ఫోన్ తీసుకొ చ్చి కాపీ కొడుతున్నాడ ని తండ్రి నర్సింహుల కు ఫోన్లో సమాచా రం ఇవ్వగా విద్యార్థి తండ్రి స్కూల్‌కొచ్చి స్టాఫ్ రూమ్‌లో మనోజ్‌పై చేయి చేసుకుని వెళ్లిపోయాడు. అనంతరం మ నోజ్ గ్రామానికి వచ్చే వికాస్ స్కూల్ బస్సులో ఇంటికెళ్లాడు. ఇంటి నుంచి చీరను తీసుకుని నేరుగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. హెచ్ఎం ఎలియాస్ ను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. విద్యార్థి తండ్రి కుమారుడిపై చేయి చేసుకున్నాడని తెలిపారు.