నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి రూరల్, జనవరి 6: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నభోజనం వికటించి 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాల్తుమ్మెద ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు తోటకూర పప్పుతో మధ్యాహ్నభోజనం వడ్డించారు. భోజనం చేసిన తర్వాత తీవ్ర కడుపునొప్పితో ఆదర్శ ప్రేమ్, రోహిత్, క్లెమంత్, సాయితేజ, దుర్గాప్రసాద్, ప్రవీణ్, అద్విత్, శశివర్ధన్ తరగతిగదిలో పడిపోయారు.
ఉపాధ్యాయులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చి, పిల్లలను 108 వాహనంలో ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డీఎంహెచ్‌వో దివ్య, ఆర్డీవో పార్థసింహారెడ్డి చేరుకుని విద్యార్థులు, తల్లిదండ్రులను పరామర్శించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని, బుధవారం డిశ్చార్జి చేస్తారని డీఎంహెచ్‌వో తెలిపారు. మధ్యాహ్న భోజనం నమూనాలను ల్యాబ్‌కు పంపించి, నివేదికలు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో పేర్కొన్నారు.