కొడకండ్ల, ఏప్రిల్ 5 : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఉగాది పండుగ రోజు ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకానికి ఆదిలోనే హంసపాదులా మారింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని పలు రేషన్‌షాపులకు సన్నబియ్యం సరఫరా కాలేదు. కొడకండ్ల మండలంలో 19 రేషన్‌షాపులు ఉండగా వీటిలో కొడకండ్లలోని రేషన్ షాపు నంబర్-3తోపాటు లక్ష్మక్కపల్లి, నర్సింగాపురం, మొండ్రాయి, ఏడునూతుల, రంగాపురం, పాఖాలలోని ఎనిమిది షాపులకు సన్నబియ్యం సరఫరా కాలేదు. సన్నబియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు షాపుల వద్దకు వస్తుండటంతో చేసేదేమీ లేక డీలర్లు షాపులను బంద్ చేశారు.
మరోవైపు నర్సింగాపురంలో 55 క్వింటాళ్ల బియ్యం రావాల్సి ఉండగా వీటిలో 25 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వీటిని పంపిణీ చేసిన డీలర్ మిగతా స్టాక్ రాకపోవడంతో షాపును బంద్ చేశారు. కొడకండ్లలోని రేషన్ షాపు నంబర్-3కు 40 క్వింటాళ్ల స్టాక్ ఇవ్వగా ఒక్క రోజులోనే పంపిణీ చేశారు. మిగిలిన స్టాక్ రాకపోవడంతో డీలర్ షాప్‌ను మూసేశారు. దీనిపై తహసీల్దార్ చంద్రమోహన్‌ను వివరణ కోరగా సన్నబియ్యం సరిపడా రాలేదని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చినట్టు తెలిపారు. రాత్రి వరకు బియ్యం వస్తాయని ఆదివారం నుంచి అన్నిషాపుల్లోనూ పంపిణీ చేస్తామని చెప్పారు.
తొర్రూరు, ఏప్రిల్ 5 : సన్నబియ్యంలో బస్తాలో తూకం తక్కువగా వస్తుందని పలువురు రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బియ్యం బస్తాలో 2 నుంచి 5 కిలోల వరకు తకువ వచ్చినట్టు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని డీలర్లు పేర్కొన్నారు.