నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) చిక్కుకున్న కార్మికులు సజీవంగా ఉన్నారా అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత శనివారం ఉదయం టన్నెల్ కుప్పకూలిన విషయం తెలిసిందే. వారం రోజులు గడిచినా ఇప్పటికీ ఆ ఎనిమిది మంది జాడ తెలియలేదు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్’ (జీపీఆర్) పరికరంతో కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించినట్టు తెలుస్తున్నది. రెస్క్యూ బృందాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి జీపీఆర్ ద్వారా జీరో పాయింట్ వరకు చేరుకొని ఆ ప్రదేశమంతా స్కానింగ్ చేశారు. ఈ రిపోర్టును పరీక్షించిన అనంతరం కార్మికులు ఐదు స్పాట్లలో చిక్కుకొని ఉంటారనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. మరోసారి క్రాస్‌చెక్ చేసుకున్న బృందం ఇది నిజమేనన్న నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అయితే వారంతా ప్రాణాలతో ఉన్నారా అనే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు 8 అంబులెన్సులు చేరుకున్నాయి. ఎస్ఎల్బీసీ ఘటనలో మరణించిన కార్మికుల మృతదేహాలను ఏ క్షణంలోనైనా నాగర్‌కర్నూల్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఎనిమిది ప్రైవేట్ అంబులెన్సులను హైదరాబాద్ నుంచి రప్పించారు. వైద్య సిబ్బంది లేకుండా కేవలం పైలెట్ తో కూడిన అంబులెన్సులు రావడంతో కార్మికులు మృత్యువాత పడ్డారనేది నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఒక్కో అంబులెన్సు డ్రైవర్‌కు తాము చెప్పిన స్టేట్ కు వెళ్లాల్సి ఉంటుందని ముందుగానే సమాచారం ఇచ్చారు.