హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా చేసే టెండర్ల ప్రక్రియ మొదటికొచ్చింది. నిబంధలను మార్చి గడువును మూడుసార్లు పొడిగించిన అధికారులు చివరకు రద్దుచేశారు. జోనల్ స్థాయిలో టెండర్లు పిలిచి ఏడుగురు కాంట్రాక్టర్లను ఎంపిక చేయాలని నిర్ణయించారు. మళ్లీ జిల్లాస్థాయిలోనే ఖరారు ఆలోచన మార్చుకున్నారు. ఈ నెలాఖరులోగా కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తి చేస్తామని వెల్లడించారు. అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ పరిధిలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలకు 2025-26 సంవత్సరానికి గాను 36.96కోట్ల కోడిగుడ్లు సరఫరా కోసం ప్రభుత్వం మార్చి 30న టెండర్లు పిలిచి, ఏప్రిల్ 15 వరకు గడువు విధించింది. ఆగ్మార్క్ రిప్లికా సీరియల్ నంబర్ కలిగిన వారే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఈ గుర్తింపు కలిగినవారు రాష్ట్రంలో ఏడుగురే ఉన్నారని, వారికి లబ్ధి కలిగించడమే ప్రభుత్వ ఉద్దేశమని పెద్దఎత్తున ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆ నిబంధనలను మార్చిన సర్కారు.. గడువును మే 15 వరకు పొడిగించింది. అయినా ఆరోపణలు ఆగలేదు. ఇప్పుడు టెండర్ల ప్రక్రియను రద్దు చేసి, జిల్లాల స్థాయిలోనే ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు కాంగ్రెస్ పెద్దలు, కీలకమైన అధికారుల హస్తం ఉన్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌లోని కొందరు నాయకులకు కాంట్రాక్టును కట్టబెట్టేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పారదర్శకత కోసమే టెండర్లను రద్దు చేశామని అధికారులు చెప్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, కస్తూర్బా స్కూళ్లు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు కోడిగుడ్లు, కూరగాయాల సరఫరా కోసం జిల్లా స్థాయిలోనే టెండర్లు పిలువాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు కలెక్టర్లు చైర్మన్లుగా 16 మందితో కమిటీ వేయాలని నిర్ణయించారు. కమిటీలో వైస్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్ (లోకల్‌బాడీ), సభ్యులుగా డీఈవో(కస్తూర్బా), డీఎస్డీవో, డీఎండబ్ల్యూవో, డీబీసీడబ్ల్యూవో, డీడబ్ల్యూవో తదితరులు సభ్యులుగా ఉంటారు.