హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల మూసివేతలు, సిబ్బంది తొలగింపుతోపాటు విద్యార్థుల భోజనానికి కూడా కొర్రీలు పెడుతున్నది. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు సోమ, బుధ, శనివారాల్లో గుడ్లను, మిగిలిన రోజులలో అరటిపండ్లను అందించాలని నిబంధన ఉన్నది. కానీ సర్కారు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఏజెన్సీలు హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు గుడ్ల సరఫరా నిలిపివేశాయి. అక్టోబర్ 15 నుంచే సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తున్నది. దీంతో విద్యార్థులకు పోషకాహారం అందడంలేదు.
బహిరంగ మార్కెట్లో గుడ్డు ధర రూ.6.50 ఉండగా, ప్రభుత్వం మాత్రం ఒక్కో గుడ్డుకు రూ.2.5 మాత్రమే చెల్లిస్తున్నది. అందుకే విద్యార్థులకు గుడ్లను అందించ లేకపోతున్నామనీ ఏజెన్సీ నిర్వహకులు చెప్తున్నారు. గుడ్లను వడ్డించకపోవడంతో విద్యార్థులకు పౌష్టికాహారం లేక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థులకు మంచి ఆహారం కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నదా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.