హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో రామప్ప దేవాలయం అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో యునెసో గుర్తింపు లభించే అరుదైన కట్టడాలు మరో 10 వరకు ఉన్నాయన్నారు. రామప్ప దేవాలయ సమీపంలో సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు యునెసో, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ‘యునెసో వరల్డ్ హెరిటేజ్ వలంటీర్-2022’ క్యాంపెయిన్‌ను బ్రోచర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని బేగంపేట పర్యాటక భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్వీ క్యాంపెయిన్‌లో దేశ, విదేశాలకు చెందిన 50 మంది వలంటీర్లతోపాటు చరిత్ర, కళలు, ఆరిటెక్చర్, ఆరియాలజీ, సివిల్ ఇంజినీరింగ్ రంగాల నిపుణులు పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో వాటర్ బోర్డ్ చైర్మన్ ప్రకాశ్‌రావు, కాకతీయ హెరిటేజ్ ట్రస్టీ ప్రొఫెసర్ పాండురంగారావు, రామప్ప దేవాలయ మాజీ చైర్మన్ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.