కరీంనగర్ : స్వాతంత్య్ర సమరయోధుడిగా, నవసమాజానికి ఆదర్శప్రాయుడిగా నిలిచిన బోయినపల్లి వేంకటరామారావు (బోవేరా) ఆశయసాధనకు కృషి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
బోవేరా శతజయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గల బోవేరా భవన్లో మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బోవేరా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బోవేరా స్వాతంత్య్ర సమరయోధుడిగా పోరాటం సాగించి, స్వాతంత్య్రానంతరం ప్రజాప్రతినిధిగా ప్రజల మన్ననలు పొందిన మహనీయుడని కొనియాడారు.
తన జీవన ప్రయాణంలో నిత్యం ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి పాటుపడిన మానవతావాది, కుల వ్యవస్థను బహిష్కరించిన గొప్ప వ్యక్తి. వారి జీవితం ఉద్యమ జీవితం అని పేర్కొన్నారు.
కరీంనగర్ గాంధీగా, బోవేరాగా ప్రజలు ప్రేమతో పిలుచుకునే బోయినపల్లి వెంకటరామారావును స్మరించుకోవాలన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహ ప్రతిష్ఠకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రముఖవాగ్గేయకారుడు వరంగల్ శ్రీనివాస్‌కు బోవేరా కవిత పురస్కారాన్ని మంత్రి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ, చైర్మన్ అల్లం నారాయణ, నగర మేయర్ సునీల్ రావు, బొవేరా కుమారుడు బోయినిపల్లి హన్మంతరావు, తదితరులు ఉన్నారు.