మహబూబాబాద్ : డోర్నకల్ ప్రజలు నన్ను వారి ఆడబిడ్డగా భావించి ఎప్పుడూ ఆదరించారని, ఈ ప్రాంత అభివృద్ధి తన బాధ్యత అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. డోర్నకల్‌లోని సీఎస్ఐ చర్చిలో జరిగిన 38వ ఆలోచన మహా సభల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు.
డోర్నకల్‌కు నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడకు రావడం నాకు సంతోషంగా ఉందన్నారు. ఈ చర్చి నా కుటుంబం అనుకుంటాను. ఈ చర్చి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయన్నారు. 38వ ఆలోచన మహా సభలు ఇక్కడ ఇంత ఘనంగా చేసుకోవడం సంతోషకరమన్నారు. ప్రభు ఆశీస్సులతో నేడు ఈ వేదిక ద్వారా ఇంతమందిని కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
అందరి జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొస్తున్న ఫాదర్, బిషప్ లకు కృతజ్ఞతలు. నేను 10 తరగతి చదవడానికి ఇక్కడ బిషప్ స్కూల్ వచ్చాను. కానీ అదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చాను. డోర్నకల్ ప్రజలు నన్ను వారి బిడ్డగా భావించి ఎప్పుడూ ఆదరించారన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో మొదటి మహిళా మంత్రిగా మహిళా సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా ఉండడం నా పూర్వ జన్మ సుకృతం.
అన్ని మతాలు, కులాల్ని గౌరవించే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే క్రిస్మస్ సందర్భంగా విందులు ఏర్పాటు చేసి, దుస్తులు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు. డోర్నకల్ చర్చి కూడా ఇక్కడి పేద బిడ్డలను దగ్గరికి తీసి, వారి అభివృద్ధి కోసం పని చేస్తుంది. ఈ పని ఇంకా ఎక్కువగా చేయాలన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.
త్వరలో ఇక్కడ జూనియర్ కాలేజీ రానుందన్నారు. డోర్నకల్ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి వెంట జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, టీ.ఆర్.ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కాలం రవీందర్ రెడ్డి, సురేష్ ప్యాట్ని, మోయిన్ పాషా, తాళ్లూరి హనుమ, ఇతర నాయకులు పాల్గొన్నారు.