భీమ్‌గల్, మే 17: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య అసమ్మతి భగ్గుమన్నది. మండల అధ్యక్షుడి నియామకం పార్టీలో చిచ్చు రేపింది. భీమ్‌గల్ మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొదిరె స్వామి, వైస్ చైర్మన్ భర్త జేజే నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, డీసీసీ జిల్లా కార్యదర్శి కుంట రమేశ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అరిగెల జనార్దన్, గిరిజన నాయకుడు గోపాల్ నాయక్ సహా మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు గ్రామాల సర్పంచులు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారు. ఆదివారం భీమ్‌గల్‌లో ఆయన దిష్టిబొమ్మను ఊరేగించి ప్రధాన కూడలిలో దహనం చేశారు.
ముత్యాల సునీల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ పదవులు అమ్ముకున్న సునీల్‌రెడ్డిని వెంటనే తొలగించాలని నినదించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏండ్ల తరబడి పోరాడిన నాయకులు, గిరిజన నాయకులకు అన్యాయం చేస్తున్నాడని, డబ్బులకు అమ్ముడుపోయి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నాడని మండిపడ్డారు. మండల అధ్యక్ష పదవిని మున్సిపాలిటీకి చెందిన వ్యక్తికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అధిష్ఠానం చర్యలు తీసుకోకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కాగా భీమ్‌గల్.. పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ సొంత మండలం కావడంతో తిరుగుబాటు వ్యవహారం ఆయనకు తలనొప్పిగా మారింది.