హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): మతపరమైన సంస్థలు, ప్రార్థనా మందిరాలను రాజకీయ ప్రయోజనాల కోసం, పార్టీ ప్రచారాల కోసం వాడుకోవడం చట్టప్రకారం తీవ్రమైన నేరమని డీజీపీ శివధర్‌రెడ్డి హెచ్చరించారు.వారికి ఐదేండ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని, ఈ విషయంలో పోలీసులు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సీపీలు, జిల్లాల ఎస్పీలు, స్టేషన్ హౌస్ఆఫీసర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నిబంధనల మేరకు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. బహిరంగ సభలు, ఊరేగింపులలో ముందస్తు అనుమతులు పొందాలని, పోలీసుల సూచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.