హైదరాబాద్, మే 15(నమస్తే తెలంగాణ): గత రెండేండ్లుగా పోలీసుల్లో ఆత్మసె్థైర్యం తగ్గినట్లు గమనించానని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. లండన్, యూఎస్ విధానాలు ఇకడ రుద్దడం సరికాదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం నిర్వహించిన ఓ కాన్క్లేవ్లో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. 5 శాతం ఉన్న రౌడీషీటర్లు, క్రిమినల్స్, సంఘ వ్యతిరేక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే, 95 శాతం ప్రజలకు ప్రశాంతత లభిస్తుందని స్పష్టంచేశారు. ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఉంటేనే పబ్లిక్ సర్వీస్‌లోకి రావాలని సూచించారు. డబ్బు, పవర్ కోసం వచ్చి వ్యవస్థను భ్రష్టుపట్టించొద్దని, డబ్బులే కావాలంటే పాన్‌షాప్ పెట్టుకున్నా సంపాదించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు. సంప్రదాయ పద్ధతులు వీడి, సరికొత్త సవాళ్లయిన నారోటిక్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై పోలీసు శాఖను సమూలంగా సన్నద్ధం చేస్తున్నట్టు డీజీపీ వెల్లడించారు.
విద్యాసంస్థల్లో డ్రగ్స్ విస్తరించడం ఆందోళనకరమని, దీని నివారణకు ప్రతి విద్యాలయంలో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటుచేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయనున్నదని డీజీపీ తెలిపారు. త్వరలోనే జీవో రాబోతున్నట్టు ప్రకటించారు. అడ్మిషన్ల సమయంలోనే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అండర్ టేకింగ్ తీసుకోవాలని, విద్యాసంస్థల లోపల ఇలాంటి ఉదంతాలు జ రిగితే యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు. 16 గంటలకు పైగా శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటం డీజీపీగా తన బాధ్యత అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75వేల మంది సిబ్బందికి ప్ర త్యేక యాప్ తీసుకొచ్చి వారి ఆరోగ్యాన్ని మా నిటర్ చేయబోతున్నట్టు వెల్లడించారు.