హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.2,072 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీల హామీల్లో భాగంగా ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకం అమలు పరిచి, జీరో టికెట్లకు ప్రతి నెలా రూ.350 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చి.. దాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఆర్టీసీకి అరకొర నిధులు విడుదల చేస్తూ ప్రతినెల ఇచ్చే డబ్బుల్లో కోత పెడుతున్నారని మండిపడ్డారు. దీంతో ఆర్టీసీ ఆర్థికంగా మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని వాపోయారు.
ఆర్టీసీకి చెల్లించాల్సిన మహాలక్ష్మీ పథకం సొమ్ము రూ.2,080 కోట్లు ఇవ్వకుండా ఆ భారాన్ని ఆర్టీసీ మీదనే రుద్దాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 2017 వేతన సవరణ బకాయిలు, 2021, 2025 వేతన సవరణలు అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. సంస్థకు మహాలక్ష్మీ కింద మొత్తం రూ.8,700 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.6,620 కోట్లే విడుదల చేసి, మొత్తం చెల్లించినట్టుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నదని విమర్శించారు.
బస్సులను సమకూర్చడంలో, సిబ్బందిని నియమించడంలో, మహాలక్ష్మీ పథకం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను నివారించడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీలో పొదుపు చేసుకున్న మొత్తాలకు చెల్లించాల్సిన వడ్డీ 15 నెలలుగా చెల్లించకపోవడంతో, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సవతి ప్రేమను వీడి తక్షణమే రూ.2,080 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.