Professor Haragopal | హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : అన్ని విషయాల్లో దేశానికి ఒక రోల్ మాడల్‌గా, ప్రామాణికంగా ఉండాల్సిన తెలంగాణలో పౌరహక్కులు, చట్టబద్ధపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేవి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జాతీయ అవసరమని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ‘మేము మంచిగా, చట్టబద్ధంగా పరిపాలిస్తున్నం’ అని రాహుల్‌గాంధీ చెప్పుకోవడానికైనా తెలంగాణలో ఒక ప్రజాస్వామిక, సాంస్కృతిక వికాసం కావాలని స్పష్టంచేశారు. రాజ్యాంగాన్ని పట్టుకొని మరీ ప్రమాణం చేశారు కాబట్టి, ఇది వారి నైతిక బాధ్యత అని ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పది నెలల పాలన ఎలా ఉన్నది? మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల తీరు ఎలా ఉన్నది?
ప్రభుత్వాన్ని పది నెలల్లో అంచనా వేయలేం. కాంగ్రెస్ పార్టీ తమ నేతలను కలిపి తీసుకెళ్లడంలో ఇబ్బంది పడుతున్నది. ముగ్గురు, నలుగురు మంత్రులు పవర్‌ఫుల్‌గా ఉన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు, వాటి అమలుకు కావాల్సిన వనరులు సమీకరించలేకపోతున్నారు. హామీల అమలులో ఇబ్బందిపడుతున్నారు. బీజేపీ కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నది కాబట్టి, కేంద్ర సహకారం ఎక్కువగా ఉండదు. మరోవైపు, ఇచ్చిన హామీలపై ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. టీంవర్ అక్కడక్కడా లోపిస్తున్నది. ఇంకో రెండేండ్లు పూర్తయితే కానీ, పూర్తి అంచనా వేయలేము. పౌరహకులు, ప్రజాసంఘాల మీటింగ్‌లకు సైతం అనుమతులు ఇవ్వడం లేదు? ఈ విషయంలో మీరు ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడారా? ఈ సమస్య మొదట్లో వచ్చింది. పౌరహకుల సంఘాల మీటింగ్‌లకు కూడా పోలీసులు అనుమతులు అడిగారు. మేము సీఎం దృష్టికి తీసుకొచ్చాం. కొంత పరిస్థితి మారింది.
బీఆర్ఎస్ హయాంలో ఒకేఒక ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. ప్రజాపాలనలో మావోయిస్టుల ఎన్కౌంటర్లు ప్రారంభమయ్యాయి. దీనిపై మీరేమంటారు?
ఇటీవల తెలంగాణలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ప్రజాపాలన అంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో ఇలా జరగడమేంటి? అని మేమంతా ఆశ్చర్యపోయాం. అప్పుడున్న పోలీసు యంత్రాంగమే కదా ఇది. ‘మీరు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి.. పోలీసుల ఓవర్ యాక్షన్ తగ్గించాలని, పోలీసు ఆటిట్యూడ్ మార్చాల్సి ఉన్నది’ అని ప్రభుత్వానికి చెప్పాం. పోలీసు యంత్రాంగంలో చాలా మార్పులు రావాలి. లేకపోతే క్షేత్రస్థాయిలో చాలా నష్టం వాటిల్లుతుంది.
హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోకి కూడా బుల్డోజర్ పాలన తీసుకొచ్చింది. అర్థరాత్రిళ్లు, తెల్లవారుజామున వెళ్లి పేదల బతుకులను ఛిద్రం చేస్తున్నదనే విమర్శ ఉన్నది కదా?
హైడ్రా.. కూల్చివేతల విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రకటనలు చేస్తున్నది. వారికి భరోసా కల్పించే మార్గం చూపాలి. వారికి గౌరప్రదమైన జీవితం కల్పించే బాధ్యత తీసుకోవాలి. మధ్యతరగతి వారికి లోన్లు ఇస్తారా? ఏవైనా రాయితీలు ఇస్తారా? కొత్త ఇండ్లు కట్టిస్తారా? అనేది స్పష్టత ఇవ్వాలి. వెంటనే అలా రోడ్డున పడేయటం అన్యాయం. ఆ తర్వాత పెద్దలు ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారో వాటిని తక్షణం కూల్చివేయాలి. ఎకడైతే పేదలు గుడిసెలు వేసుకొని కాలం వెల్లదీస్తున్నారో.. వారికి ప్రభుత్వం పూర్తిగా పునరావాసం కల్పించాలి. దాంతోపాటు, పేదలకు ఆరు నెలలపాటు రూ.10వేలపైనే ప్రతినెలా ప్రత్యేక భృతి ఇవ్వాలి. వాళ్లుకు పని దొరికే వరకు ఆర్థిక సాయం అత్యవసరం. పేదవాళ్ల కష్టాన్ని కూలగొట్టొద్దని ప్రభుత్వానికి, హైడ్రా కమిషనర్‌కు ప్రొఫెసర్ నాగేశ్వర్ ద్వారా చెప్పాం. వారికి పునరావాసం కల్పించాలని చెప్పాం. అందుకు వారు సుముఖంగా స్పందించారు.
‘ఆపరేషనన్ కగార్’లో భాగంగా నిర్వహించిన మీంటింగ్కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీఎస్, డీజీపీ హాజరయ్యారు.. దీన్ని మీరెలా చూస్తారు?
మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని చెప్పే కేంద్ర హోంశాఖ మంత్రి మీటింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రిగా ఆయన కొన్ని డైరెక్షన్లు ఇచ్చే ఉంటారు. అయితే, కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని పట్టుకొనే ప్రచారం, ప్రమాణస్వీకారం చేశారు కాబట్టి.. ‘మాకు రాజ్యాంగం ప్రామాణికం, చట్టబద్ధంగా పరిపాలించాల్సి ఉంటుంది. దానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని హోంమంత్రికి చెప్పారనే అనుకుంటున్నాం. లేదా కాంగ్రెస్ ఆ స్టాండ్ తీసుకోవాలి. అలా చెప్పగలిగితే, ప్రజాస్వామ్యాన్ని కొంతవరకైనా కాపాడినట్టే.
తెలంగాణలో పట్టుసాధించాలని, అధికారం చేపట్టాలని చూస్తున్న బీజేపీ.. రాష్ట్ర కాంగ్రెస్‌పై ఒత్తిడి చేయకుండా ఉంటుందా? తన రాజకీయ అనుభవంతో కేసీఆర్ నిలబడ్డారు. రేవంత్‌రెడ్డి ఆ స్థాయిలో నిలబడగలరా?
నిజమే, కేసీఆర్ తన రాజకీయ అనుభవంతో కొంతవరకు కేంద్రం ఒత్తిడిని తట్టుకున్నారు. ఎక్కడైనా ఇలాంటి ఒత్తిడిలు ప్రజా ప్రభుత్వంలో మంచివి కాదు. చట్టాలకు అతీతమైన ఎన్కౌంటర్లు చేస్తే ఇబ్బందే. వాళ్లు, వీళ్లు ఎదురెదురుగా తారసపడి ఫైర్ చేసుకుంటే, అటువంటి ఎన్కౌంటర్లను పౌరహక్కుల సంఘం విమర్శించదు. బూటకపు ఎన్కౌంటర్లు చేస్తేనే ఇబ్బంది. ఎందుకంటే వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. కేంద్ర ఒత్తిడిని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు తట్టుకుంటుందో చూడాలి.
ఇదే అంశంలో నేటికీ ముఖ్యమంత్రి సోదరుడి నివాసం ఇంకా కూల్చలేదు.. పేదల ఇండ్లు కూలిపోతున్నాయి.. మీరేలా చూస్తారు?
ప్రభుత్వం ఆ ఇంటిని కూడా కూలగొడతామని అంటున్నది. దానిని కూలగొట్టకుండా ముందుకు వెళ్లలేరు. మన తమ్ముడు, బంధువు అంటే కుదరదు కదా. ఆ ఇల్లును సాక్షాత్తూ సీఎం కూలగొట్టిస్తామంటున్నారు. ఒకవేళ కూల్చకపోతే దాని పరిణామాలు ప్రభుత్వం ఎదురొవాల్సి ఉంటుంది. బాధితులు సమయం అడిగితే కొంత వెసులుబాటు ఇవ్వాలి. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికిప్పుడే యుద్ధ ప్రాతిపదికగా చేయాల్సిన అవసరం కూడా లేదని అన్నాం. లేకపోతే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు వస్తాయని వివరించాం.
వరుస ఎన్కౌంటర్లతో కేంద్ర, రాష్ట్రాలు మారణహోమం సృష్టిస్తున్నాయి. మావోయిస్టుల ఉద్యమపంథా మారాలని సీపీఐ నారాయణ అంటున్నారు? మారాల్సిన అవసరం ఉన్నదా?
ఇది మావోయిస్టుల ఉద్యమమే కాదు. ఆదివాసీల ఉద్యమం. 200 ఏండ్లుగా వారు పోరాడుతున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ రైల్వేకు కలప కావాలని అడవుల్లోకి వచ్చిన దగ్గరునుంచీ రాజ్యంతో పోరాటాలు కొనసాగుతున్నాయి. వాటి ఫలితంగానే రాజ్యాంగంలో షెడ్యూల్డ్ 5 వచ్చింది. ఆ తర్వాత పీసా చట్టం, 1/70, ఫారెస్ట్ రైట్స్ చట్టం వచ్చింది. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడవులను కొట్టేసి, ఖనిజాలను కార్పొరేట్లకు ఇస్తామంటున్నారు. ఈ క్రమంలో అడ్డొస్తే.. చెట్లను, మావోయిస్టులను కొట్టేస్తామంటున్నారు. ఈ ఆలోచన రాజ్యాంగబద్ధం కాదు. మావోయిస్టులు కూడా ఉద్యమ పంథా గురించి సమీక్ష చేసుకోవాలి.
కేంద్రం చెప్పినట్టు మావోయిస్టులను ఏరివేస్తే ఉద్యమం ఆగిపోతుందా?
వాళ్లను ఏరివేసినా కూడా ఉద్యమం ఆగదు కదా. అడవులను ఆగం చేస్తామంటే ఎవరు ఊరుకుంటారు? బొలివీయాలో ఇలాగే ఖనిజాలను కార్పొరేట్లకు ఇచ్చారు. అంతా తవ్వుకొని వెళ్తే.. ఇప్పుడది బొందల గడ్డలా మారింది. మన దేశంలో చట్టం ఆదివాసీల అనుమతి లేకుండా ఏ పనీ చేయకూడదని ఉన్నది. వారిని ఒప్పించినా పునరావాసం కల్పించాలి. ఆదివాసీలకు చట్టబద్ధంగా కల్పించిన హక్కులను గౌరవించాలి. సమస్యలు ఉన్నంత వరకూ ఆదివాసీల ఉద్యమాలు కొనసాగుతాయి. ఏదో రూపంలో అవి ఉద్భవిస్తూనే ఉంటాయి. మరోచోట పుడుతూనే ఉంటాయి.
తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్షంగా సంబంధం లేని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదురుగా ప్రతిష్టించడాన్ని మీరెలా చూస్తారు?
ఇదొక కాంట్రవర్సీ. జరిగిపోయింది. అయితే, సచివాలయ నిర్మాణానికి ముందే, కేసీఆర్ అకడే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టించి ఉంటే బాగుండేది. నా విషయానికి వస్తే వ్యక్తులు, నాయకుల విగ్రహాల ప్రతిష్ఠాపన నాకు అంగీకారం కాదు.
సోషల్‌మీడియా మెడపై ఈ ప్రభుత్వం కత్తి పెట్టిందని అనుకోవచ్చా? ఇద్దరిని అరెస్టు చేశారు.. ఇది హకుల ఉల్లంఘన కిందకు రాదా?
ప్రశ్నించినంత మాత్రాన ఇట్లాంటి అరెస్టులు తగదు. మా దృష్టికి వచ్చిన అరెస్టుల విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అయితే, సోషల్‌మీడియా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం అడగొచ్చు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఎలక్ట్రిసిటీ బోర్డు సీఎండీ ప్రభాకర్‌రావు మీద కూడా ఎన్నో ఆరోపణలు గుప్పించారు. తనకు ఉన్నదే అర ఎకరం. 30 ఎకరాలు ఉన్నాయని అన్నారు. విద్యుత్తు ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారని అన్నారు. అవన్నీ అబద్ధాలే. ఎవరిమీదనైనా విష ప్రచారం చేస్తున్నారంటే సోషల్ మీడియా విశ్వసనీయత తగ్గిపోతుంది. అయితే, వాస్తవాలు చెప్తునప్పుడు ప్రభుత్వం నిర్బంధించే పరిస్థితులు వస్తే పౌర హకుల సంఘం బాధ్యుడిగా ప్రభుత్వంతో మాట్లాడతం, ఉద్యమాలు కూడా చేపడతాం.
పట్టణాల భవిష్యత్ దృష్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి?
పట్టణ భవిష్యత్ దృష్ట్యా.. ఆక్రమణలను తొలగించాల్సిందే. బొటానికల్ గార్డెన్ విషయంలో తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ అక్కడ టూరిజం అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చింది. మేము దానికి వ్యతిరేకంగా పోరాడాం, అడ్డుకున్నాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ను కలిసి సమస్యలన్నీ వివరించాం. ఆయన వాటిని సానుకూలంగా విని, దానికి జోలికి ఎవ్వరూ వెళ్లరని హామీ ఇచ్చారు. ఇప్పుడది అలాగే ఉన్నది. అయితే, బొటానికల్ గార్డెన్‌ను కూడా టూరిజం కేంద్రం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది.
అడ్డదిడ్డంగా, అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం ఎలా ఉండాలి?
ఇప్పటి కూల్చివేతలకు.. నాడు ప్రభుత్వ అధికారులు ఎలా వాటికి అనుమతులు ఇచ్చారు? అనేది ప్రధాన అంశం. అధికారులు చెరువుల్లో పర్మిషన్ ఎలా ఇస్తారు? వారు ఉన్నదే వాటిని కాపాడుకోవడానికి కదా? పేదలకు లీగల్‌గా పర్మిషన్ ఉన్నది. వారికి నీళ్లు ఇచ్చారు.. కరెంటు ఇచ్చారు.. ఇప్పుడు ఇండ్లు ఎలా కూల్చుతారు? ఇది ముమ్మాటికి అధికారుల తప్పు. భవిష్యత్‌లో అధికారులు అలాంటి తప్పులు చేయకుండా ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వానికి ఆ అవకాశం ఉన్నది. అధికారులకు చట్టపరమైన భయం ఉంటే ఇలాంటి పొరపాట్లు జరగవు.
బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమ పథకాలు సకాలంలో రైతులకు అందాయి. ప్రస్తుతం వాటి అమలు ప్రశ్నార్థకంగా మారింది?
హమీలు ఇచ్చేముందు ఆర్థిక వనరులను అంచనా వేయాలి. ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. రైతులకు ఇచ్చిన హామీలను నిలుపుకోవడం ఏ ప్రభుత్వానికైనా అతిపెద్ద సవాలు. ఈ ప్రభుత్వానికి వనరుల సమీకరణ కష్టంగా మారింది.
కొత్త క్రిమినల్ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరీ ప్రకటించలేదు. వాటిపై మీ అభిప్రాయం?
కొత్త చట్టంలో పోలీసులకు చాలా అధికారాలు ఇచ్చారు. అందువల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. నేరాలు తగ్గించేందుకు మెరుగైన మానవ సంబంధాలు, పనిచేసుకునే హకు, అందరికీ పని, వసతుల కల్పన, విద్య, అందులో నైతిక విలువల బోధన వంటివి ప్రభుత్వం చేపట్టాలి.
పార్టీ ఫిరాయింపుల అంశం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు సైతం వెళ్లనున్నది. ఫిరాయింపులపై మీ అభిప్రాయం?
ఒక పార్టీ నుంచి గెలిచిన వారు ఆ పార్టీ భావజాలానికి కట్టుబడి ఉంటూ ప్రజలను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. మరో పార్టీలోకి వెళ్తానంటే అందులో స్వప్రయోజనం తప్ప.. ప్రజల ప్రయోజనం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నవారు పార్టీ మారాల్సి వస్తే.. తక్షణం తన ప్రజలకు క్షమాపణ చెప్పి, తాను ఎందుకు పార్టీ మారాల్సి వస్తున్నదో వివరించాలి. గెలిచిన గుర్తుపై రాజీనామా చేసి, తాను మారాలనుకుంటున్న పార్టీ గుర్తుపై పోటీ చేయాలి. అప్పుడు ప్రజలకు అతనిపై నమ్మకం ఉంటే గెలిపిస్తారు. లేకుంటే ఓడగొడతారు. పార్టీ ఫిరాయింపులు అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరైనా ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. మరో పార్టీకి వెళ్లాలనుకుంటే కచ్చితంగా రాజీనామా చేసే వెళ్లేలా పార్లమెంట్లో ఉన్న చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు పాటించాలి.
మీరు ప్రభుత్వానికి ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా?
నిర్బంధాన్ని తగ్గించాలి. అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చినప్పుడు నాతో సహా ఆరుగురిపై ఉపా కేసు ఉపసంహరించుకున్నారు. ఏ తప్పు చేయని వారిని ఏండ్ల తరబడి జైల్లో వేయడం దారుణం. పోలీసులు కూడా ఉపా చట్టాలు, ఇతర కేసులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. గతంలో జరిగిన పొరపాట్ల నుంచే కదా వీళ్లు నేర్చుకోవల్సింది.
ఒక విద్యావేత్తగా ఎలాంటి మార్పులు కోరుతున్నారు?
ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి. అందరికీ సమానమైన, నాణ్యమైన, ఉచిత విద్యను కామన్ స్కూళ్ల ద్వారా అందించాలి. 40 ఏండ్లుగా విద్యా పరిరక్షణ కమిటీ ఈ విధానం కోసం పోరాటం చేస్తున్నది. యూనివర్సిటీలను పటిష్టం చేసి, వాటి స్వంతంత్ర ప్రతిపత్తిని పూర్తిగా గౌరవించాలి.