హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లల్లో మరో వారం పాటు విద్యాబోధన అటకెక్కనున్నది. కులగణనతోపాటు ఇప్పుడు డాటా ఎంట్రీ బా ధ్యతలను కూడా టీచర్లకే అప్పగించారు. దీంతో రాష్ట్రంలోని 50వేల మంది టీచర్లు, హెచ్ఎంలు వారంపాటు బడులకు దూరంగా ఉండనున్నారు. ఇప్పటికే సర్వేతో 20 రోజులపాటు క్లాసులు అరకొరగా జరగగా, మరో వారం పది రోజులపాటు డాటా ఎంట్రీ కోసం క్లాసులు బం ద్కానున్నాయి. తొలుత సర్వే చేస్తే సరిపోతుందని చెప్పి.. ఇప్పుడు డాటా ఎంట్రీ కూడా చే యాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. జాతీయంగా నిర్వహిస్తున్న కేంద్రం నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్)లో 3, 6, 9 తరగతుల్లోని విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. డిసెంబర్ 4న నిర్వహించనున్న ఈ పరీక్ష కోసం విద్యాశాఖ అధికారులు ప్రాక్టీస్ పేపర్లు, మాడల్ పేపర్లను తయారుచేసి విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఈ తరుణంలోనే కుల గణన విధులు వచ్చిపడ్డాయి. దీంతో 18వేల స్కూళ్ల లో మూడు వారాలపాటు సగంపూటే క్లాసులు నడిచాయి. ఇప్పుడు డాటా ఎంట్రీ కోసం మరో వారంపాటు మళ్లీ ఒకపూటే నడవనున్నాయి. ఈ ప్రభావం న్యాస్పై పడనున్నది.
మినహాయింపునివ్వాలని విద్యాశాఖ విజ్ఞప్తి
డాటా ఎంట్రీ విధుల నుంచి టీచర్లను మినహాయించాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. విద్యాశాఖలో పనిచేస్తున్న సీఆర్పీలు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. డాటా ఎంట్రీ బాధ్యతల నుంచి టీచర్లను మినహాయించాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవలే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు సీఎస్ శాంతికుమారిని కలిసి డాటా ఎంట్రీ విధుల నుంచి టీచర్లను మినహాయించాలని కోరినట్టు తెలిసింది. ఇలా సర్వేకు, డాటా ఎంట్రీకి టీచర్లను వినియోగిస్తే, అంతిమంగా న్యాస్ ఫలితాలపై ప్రభావం పడుతుందని సీఎస్‌కు వివరించినట్టు తెలిసింది. అయితే అటు కుల గణన, ఇటు న్యాస్ సర్వే రెండు ముఖ్యమైనవేకావడంతో సర్కారు ఏదీ తేల్చుకోలేకపోతున్నది.