హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : తనకు పిల్లల చదువులే ముఖ్యమని, సర్కారు బడుల్లోని విద్యార్థులను సొంత బిడ్డల్లా భావిస్తానని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా స్పష్టంచేశారు. విద్యాశాఖ అధికారులు సైతం సర్కారు బడుల్లోని పిల్లలను సొంత బిడ్డల్లా భావించాలని సూచించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో జిల్లా విద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షించారు.
డాక్టర్ యోగితారాణా మాట్లాడుతూ.. పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు అంతా కష్టపడదామని సూచించారు. డీఈవోలంతా పాఠశాలల్లో తనిఖీలు చేయాల్సిందేనని దిశానిర్ధేశం చేశారు. 15 రోజుల తర్వాత సమావేశం నిర్వహిస్తానని, అంతలోపు పురోగతి సాధించాలని ఆదేశించారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, అడిషనల్ డైరెక్టర్లు కృష్ణారావు, రాధారెడ్డి, శ్రీహరి, రమణకుమార్, రమేశ్, శ్రీనివాసచారి, జేడీలు వెంకటనర్సమ్మ, మదన్మోహన్ పాల్గొన్నారు.
ఏప్రిల్ 5న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను ఏప్రిల్ 5న నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 5న పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.