హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): యూజీసీ నిబంధనల ప్రకారమే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడుతామని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వర్సిటీల్లో నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కామన్ రిక్రూట్మెంట్ బిల్లుపై గవర్నర్ పలు సందేహాలను లేవనెత్తిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి సబితాఇంద్రారెడ్డి నేతృత్వంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రితో కూడిన బృందం గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయింది.
సుమారు 45 నిమిషాలపాటు సాగిన భేటీలో బిల్లుకు సంబంధించిన అంశాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నియామకాల్లో రిజర్వేషన్ల అంశాన్ని గవర్నర్ లేవనెత్తగా, ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అధికారులు స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ మాదిరిగా ఈ బోర్డు ద్వారా అభ్యర్థులను ఎంపికచేసి ఆయా వర్సిటీలకు జాబితా అందజేస్తామని వివరించారు. అధికారుల వివరణపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. సమావేశం ముగిసిన అనంతరం భేటీకి సంబంధించిన వివరాలను, ఫొటోలను గవర్నర్ తమిళిసై తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇవే విషయాలపై రాజ్‌భవన్ సైతం పత్రికా ప్రకటన విడుదల చేసింది.