పహాడీషరీఫ్, అక్టోబర్ 10: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్(బీఆర్ఎస్) మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖైసర్బామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జనరల్ సెక్రటరీ సయ్యద్ బిన్ హజాబ్, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు.
వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, కాలనీలు, బస్తీల్లో మునుపెన్నడూ లేని విధంగా మౌలిక వసతులు సమకూరుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నాసర్ అవాల్గీ, జహంగీర్, అబ్దుల్లా గాలిబ్, సమెద్ బిన్ సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.