హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరమింకా ప్రారంభమే కాలేదు. బడులు తెరుచుకోలేదు. విద్యార్థుల చేరికలు (ఎన్రోల్మెంట్) పూర్తికాలేదు. అయినప్పటికీ టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటివరకు గల విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్ప్లస్(మిగులు)టీచర్లను జూన్ 13లోపే పూర్తిచేయాలన్నది. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతున్నది. ఇంత తొందరపాటు దేనికని టీచర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బడులు తెరిచిన తర్వాత కొత్తగా విద్యార్థులు చేరితే, ఎన్రోల్మెంట్ పెరిగితే బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు.
అభ్యంతరాలివీ..
రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్ల అంతర్గత సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. మిగులు(సర్ప్లస్) టీచర్లను ఇతర బడుల్లో సర్దుబాటు చేసేందుకు మార్గదర్శకాలిచ్చింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ జూన్ 13లోగా సర్దుబాటును పూర్తిచేయాలని శుక్రవారం ప్రకటించింది. జూన్ 6 నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడమే బడిబాట కార్యక్రమ ఉద్దేశం. ఎన్రోల్మెంట్ పెంచడానికి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారజాత నిర్వహిస్తున్నది. టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, మరికొన్ని సంఘాలు కూడా స్పందించాయి. ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి ఇంటింటికి తిరిగి విద్యార్థులను చేర్చుకుంటున్నారు.
దీంతో ఎన్రోల్మెంట్ పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ఈ తరుణంలో జూన్ 13లోపే సర్దుబాటు చేయాలని ఆదేశాలిచ్చింది. 2024-25 విద్యాసంవత్సరంలోని విద్యార్థుల సంఖ్యను బట్టి సర్దుబాటు చేయనున్నది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఒకవైపు అడ్మిషన్లు పెంచమంటారు.. మరోవైపు బడుల్లో టీచర్లు లేకుండా చేస్తారు.. ఇదేం విధానమని ప్రశ్నిస్తున్నారు. సర్దుబాటు అయ్యాక ఆయా బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే పరిస్థితేంటి..? వారికి పాఠాలెవరూ చెబుతారని నిలదీస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో చేయాల్సిన సర్దుబాటును జూన్‌లోనే చేయాల్సిన తొందరేముందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి అసంబద్ధ విధానాలతో విద్యాశాఖను భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడుతున్నారు.
ఎన్రోల్మెంట్ పెంచడంటూ టీచర్లను తొలగిస్తారా? : టీఎస్ యూటీఎఫ్
జూన్ 13లోపు టీచర్ల సర్దుబాటు చేయాలన్న విద్యాశాఖ నిర్ణయాన్ని టీఎస్ యూటీఎఫ్ తప్పుబట్టింది. ఒకవైపు ఎన్రోల్మెంట్ పెంచడంటూ.. మరోవైపు టీచర్లను తొలగిస్తారా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం సర్కారుబడుల పాలిట గొడ్డలిపెట్టువంటిదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ అభిప్రాయపడ్డారు. ఈ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.