Telangana | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన డీఎస్సీ -24 టీచర్లకు వేతనాల చెల్లింపు డోలాయమానంలో పడింది. డీఎస్సీ -2024లో భాగంగా 10వేలకు పైగా టీచర్లను నియమించింది. కొత్త టీచర్లకు ఈ నెల 10 నుంచి వేతనాలిస్తామని విద్యాశాఖ వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు కొత్త టీచర్లందరికి అక్టోబర్ 10వ తేదీతోనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. కానీ ఆర్డర్లు ఇచ్చిన వారం తర్వాత జిల్లాల్లో కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇచ్చారు.
కొంత మంది టీచర్లు ఈ నెల 15, మరికొందరు ఈ నెల 17న పాఠశాలల్లో చేరారు. విద్యాశాఖ మాత్రం ఈ నెల 10 నుంచే వేతనాలిస్తామన్నది. పనిచేయని కాలానికి వేతనాలు ఎలా ఇవ్వడమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జూన్లో చేపట్టిన బదిలీల్లో కొంత మంది టీచర్లు బదిలీ అయ్యారు. కొన్ని పాఠశాలల్లో సింగిల్ టీచర్ ఉన్న కారణంగా టీచర్లను రిలీవ్ చేయలేదు. కొత్త టీచర్లు చేరిన తర్వాత రిలీవ్ చేశారు.
అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న కాలానికి జాయినింగ్ రిపోర్టు ఇచ్చే నాటికి వారం రోజుల వ్యవధి ఏర్పడింది. ఈ వ్యవధిలో కొత్త టీచర్లకు వేతనాలు ఇస్తే ఈ నెల 10వ తేదీ నుంచి రిలీవ్ అయ్యే మధ్యకాలానికి ఒకే పోస్టుకు ఇద్దరు టీచర్లకు వేతనాలు డ్రాచేయాల్సి ఉంటుంది. ఇక కొత్త టీచర్లకు ఈ నెల జీతాలు రావడం కష్టంగానే కనిపిస్తోంది. రెండు నెలల వేతనం డిసెంబర్ 1న అందే అవకాశాలున్నాయని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని టీఎస్ యూ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య కోరారు.