Alcohol | మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమన్న విషయం మనందరికి తెలిసిందే. మద్యం సేవించడం వల్ల కాలేయ ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆరోగ్యం మీద స్పృహ రావడంతో మద్యానికి చాలా మంది దూరంగా ఉంటున్నారు. మద్యం తీసుకోవడం 6 నెలల పాటు మానేయడం వల్ల శరీర ఆరోగ్యం మొత్తం గణనీయంగా మెరుగుపడుతుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడడాన్ని గమనించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మద్యం మానేయడం వల్ల శరీరం తనని తాను మరమ్మత్తు చేసుకోవడానికి కావల్సినంత సమయం లభిస్తుంది. కాలేయ పనితీరు మెరుగుపడడంతో పాటు నిద్ర నాణ్యత పెరుగుతుంది. స్పష్టమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. శరీరం పోషకాలను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది.
మద్యం సేవించడం మానేయడం ద్వారా అనేక లాభాలను సొంతం చేసుకోవచ్చు. ఆరు నెలల పాటు మద్యాన్ని మానేయడం వల్ల శరీర ఆరోగ్యం ఏవిధంగా మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల కొవ్వు కాలేయం, కాలేయ వాపు వంటి సమస్యలు రావడంతో పాటు కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. మద్యం మానేయడం వల్ల కాలేయానికి తిరిగి విశ్రాంతి లభిస్తుంది. కాలేయం దానిని తిరిగి మరమ్మత్తు చేసుకుంటుంది. కొవ్వునిల్వలు తగ్గుతాయి. కాలేయ ఎంజైమ్ లు తిరిగి సాధారణ స్థాయికి వస్తాయి. మద్యం సేవించడం వల్ల నిద్ర చక్రాలకు, నిద్రకు అంతరాయం కలుగుతుంది. మద్యం మానేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. మరింత ఉత్సాహంగా పని చేసుకోగలుగుతారు.
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరానికి క్యాలరీలు ఎక్కువగా అందుతాయి. దీంతో శరీర బరువు పెరుగుతుంది. ఆల్కహాల్ మానేయడం వల్ల క్యాలరీలు తక్కువగా అందుతాయి. దీంతో శరీర జీవక్రియ పెరగడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. ఆల్కహాల్ ఆందోళన, నిరాశ వంటి వాటిని మరింత తీవ్రతరం చేస్తుంది. మద్యం మానేయడం వల్ల న్యూరోట్రాన్స్మిటర్ సమతుల్యత స్థిరీకరించడం ప్రారంభమవుతుంది. దీని వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గుతుంది. మానసికంగా మరింత స్పష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆల్కహాల్ చర్మాన్ని డీహైడ్రేషన్ బారిన పడేలా చేస్తుంది. దీంతో దద్దుర్లు, చర్మం రంగు మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మద్యం మానేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలు తగ్గుతాయి.
మద్యం మానేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇన్పెక్షన్ లు దరి చేరకుండా ఉంటాయి. జలుబు, జ్వరం వంటి సమస్యలతో పోరాడే శక్తి పెరుగుతుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల రక్తపోటుతో పాటు గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. మద్యం మానేయడం వల్ల హృదయనాళ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మద్యం అధికంగా సేవించడం వల్ల ఆల్కహాల్ పేగు లోపలి పొరను దెబ్బతీస్తుంది. దీంతో పోషకాల శోషణ తగ్గుతుంది. కాలక్రమేణా బి12, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాల లోపం తలెత్తుతుంది. ఆల్కహాల్ మానేయడం వల్ల ఆయా సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహిస్తుంది. మద్యం మానేయడం వల్ల ఇలా అనేక ప్రయోజనాలను పొందవచ్చని కనుక వెంటనే మద్యం సేవించడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.