హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2008 అభ్యర్థులకు క్యాబినెట్ నిర్ణయం మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,367 మంది అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 5 వరకు వెరిఫికేషన్ కొనసాగుతుందని, ఉమ్మడి జిల్లాల వారీగా కాంట్రా క్ట్ పద్ధతిలో పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఒప్పుకుంటున్నట్టు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలోనే సమ్మతిపత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు 2008 డీఎస్సీలో 30 శాతం కోటాతో నష్టపోయిన అభ్యర్థుల జాబితాను ఉమ్మడి జిల్లాల వారీగా డీఈవోలకు పంపినట్టు పేర్కొన్నారు. వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లోనూ పొందుపరిచినట్టు తెలిపారు. నేటికి తమ 14 ఏండ్లనాటి కల నేరవేరనున్నదని డీఎస్సీ- 2008 మెరిట్ బీఈడీ క్యాండిడేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమా మహేశ్వర్‌రెడ్డి, కార్యదర్శులు సంగమేశ్వర్, చంద్రశేఖర్, రమేశ్, డీఎస్సీ-2008 సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్ తదితరులు తెలిపారు.