హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో మీడియా స్వేచ్ఛను కాపాడండి.. మీడియాతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలని, బలవంతపు అరెస్టులకు ముందు ప్రజాస్వామిక ప్రక్రియను అనుసరించాలని మీ అధికారులను ఆదేశించండి..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈడీఐ) విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు ఆదివారం ఈడీఐ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్, ప్రధాన కార్యదర్శి రాఘవన్ శ్రీనివాసన్, ట్రెజరర్ టెరెసా రెహ్మాన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు.
ఫేక్‌న్యూస్ ప్రసారం చేశారనే ఆరోపణలతో ఇద్దరు ఎన్టీవీ జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మీడియా ప్రొఫెషనల్స్‌కు సంబంధించి స్వతంత్ర అగ్రసంస్థ తమదని, పత్రికా స్వేచ్ఛను కాపాడటం, జర్నలిజంలో అత్యున్నత నైతిక ప్రమాణాలను ప్రోత్సహించడం తమ బాధ్యత అని తెలిపారు. ఎన్టీవీలో ప్రసారమైన ఒక గాసిప్ కార్యక్రమంలో ఒక మహిళా ఐఏఎస్ ఒక మంత్రితో సన్నిహిత సంబంధం కారణంగా బదిలీ అయ్యారని పేర్కొన్నదని వివరించారు. అయితే, ఆ వార్త ప్రసారంలో ఎక్కడా ఎలాంటి పేర్లు ప్రస్తావించలేదని గుర్తుచేశారు.
దీనిపై తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం సమావేశమై ఎన్టీవీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. వారు డిమాండ్ చేసిన వెంటనే జర్నలిస్టులు, ఎన్టీవీ ఇన్‌ఫుట్ ఎడిటిర్లపై పరువునష్టం కింద పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారని చెప్పారు. అర్ధరాత్రి వేళ ఇండ్లకు వెళ్లి జర్నలిస్టులను అరెస్టు చేసి, కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు లాకప్‌లో ఉంచారని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం స్వతంత్ర మీడియాపై భయాందోళన కలిగిస్తున్నది, మీడి యా స్వేచ్ఛగా, ఎలాంటి అడ్డంకులు లేకుం డా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వారు సీఎంకు విజ్ఞప్తిచేశారు.