హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలోని ఈడిగ (తెలంగాణలో గౌడ) సామాజికవర్గాన్ని నాశనం చేసేందుకు అక్కడి బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తున్నదని నారాయణగురు శక్తి పీఠాధిపతి, ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామిజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ణాటక రాజకీయాల్లో ఈడిగ కులస్థులు క్రమంగా ఎదుగుతున్నారని, వారిని రాజకీయాల్లోకి రాకుండా చేయాలన్నదే అక్కడి అగ్రకులాల నేతల కుట్ర అని ఆరోపించారు. అందుకే కర్ణాటకలోని బీజేపీ సర్కార్ కల్లుగీతపై నిషేధం విధించి, ఈడిగ కులస్థుల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలను బట్టబయలు చేసేందుకు తాను 2023 జనవరి 6 నుంచి మంగళూరులోని గోకర్ణేశ్వర్ మందిరం నుంచి బెంగళూరు వరకు 658 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టన్నట్టు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ గౌడ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సభలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ తెలంగాణ సర్కార్ స్థానిక గౌడ్ల కోసం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తుంటే విని ఆశ్చర్యపోయానని చెప్పారు.
గౌడ సామాజిక వర్గానికి భరోసాగా నిలుస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లను కలిసి కర్ణాటకలో తన ఆందోళనకు మద్దతు కోరేందుకు నగరానికి వచ్చినట్టు తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, ఆల్ ఇండియా గౌడ సంఘం అధ్యక్షుడు వేములయ్యగౌడ్ ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక బీజేపీ సర్కార్ ఈడిగలను (గౌడ కులస్థులను) పూర్తిగా దగా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘గుల్బర్గా, యాద్గిరి, రాయచూర్ జిల్లాల్లోని 30 వేల మంది.. కుటుంబాలతో సహా తెలంగాణ, మహారాష్ట్ర, కేరళకు వలసపోయారు. అక్కడ హోటళ్లలో పనిచేస్తూ, పాన్‌పరాగ్‌లు అమ్ముకుంటూ, ఇతర కూలీపనులు చేసుకుని దీనంగా బతుకు వెళ్లదీస్తున్నారు. ఉన్నత చదువులు చదివినవారికి కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అన్నీ ఉన్నతవర్గాల వారికే కేటాయిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వంలో ఈడిగ కులానికి చెందిన ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా.. మా సమస్యలపై ఏనాడూ నోరువిప్పిన పరిస్థితి లేదు. కర్ణాటక బీజేపీ సర్కార్‌లో ఉన్నతవర్గాలవారి మాటే చెల్లుబాటు అవుతుంది’ అన్నారు.
తెలంగాణలో గౌడ సామాజికవర్గం నుంచి ఒకే ఒక్క మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉన్నప్పటికీ ఇక్కడి ప్రభుత్వం గౌడ్ల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకొంటున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులను కాపాడేందుకు అంత స్వేచ్ఛను ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలో గౌడ సామాజికవర్గానికి గౌరవాన్ని పెంచిన, గీత వృత్తి దారులు కులవృత్తి స్వేచ్ఛగా చేసుకునేలా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. దేశం మొత్తంలో తెలంగాణలోనే గౌడ కులవృత్తికి ఎంతో గౌరవం ఉన్నదని అన్నారు. గౌడ కులస్థులు ఆత్మగౌరవంతో ఎలా బతకాలన్నదానికి తెలంగాణ తమకు ప్రేరణగా నిలుస్తున్నదని చెప్పారు. కర్ణాటకలో ఈడిగల దుస్థితిపై జరుగుతున్న ఆందోళనకు తెలంగాణ గౌడ సమాజం సైతం అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మద్దతు ఇచ్చినట్టు స్వామిజీ వెల్లడించారు. తెలంగాణ గౌడ సంఘాల తరఫున కర్ణాటక ఆందోళనకు మద్దతు తెలియజేస్తున్నట్టు తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, ఆల్ ఇండియా గౌడ సంఘం అధ్యక్షుడు వేములయ్యగౌడ్ ప్రకటించారు.