హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అల్ప్రాజోలం కేసుల్లో ఈడీ కీలక చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిందితుల రూ.4.79 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. తెలంగాణ, ఏపీలకు చెందిన గిర్మగౌని సుధీర్, బిశ్వేశ్వర్ సింగ్, రాజేశ్వర్ శర్మ జోషి, భవానిగారి ప్రభువర గౌడ్, గజ్జెల శ్రీశైలం గౌడ్‌కు చెందిన స్థిరాస్తులు ఈ అటాచ్మెంట్లలో ఉన్నట్టు వెల్లడించింది.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తును ప్రారంభించినట్టు పేర్కొన్నది. గిర్మగౌని సుధీర్ తన సోదరుడు ప్రభువర గౌడ్, బామ్మర్ది గజ్జెల శ్రీశైలం గౌడ్ సాయంతో 2014 నుంచి కమీషన్ ప్రాతిపదికన కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నట్టు నిర్ధారించినట్టు తెలిపింది. సుధీర్ అల్ప్రాజోలంను కల్లు వ్యాపారులకు విక్రయించగా, వారు కల్తీ కల్లు తయారీకి వాడినట్టు తేల్చింది.