హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఫాలన్ ఇన్వాయిస్ డి సౌంటింగ్ పేరిట పెట్టుబడిదారులను రూ.792 కోట్లు మోసగించిన కేసులో ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్‌కు చెందిన ‘హవాకర్ 800ఏ’ లగ్జరీ ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ వేలం వేయనున్నది. ఎన్935హెచ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఈ ప్రైవేట్ జెట్‌ను అమర్దీప్ 2024లో రూ.13 కోట్లతో కొనుగోలు చేశాడు. ఫాల్కన్ మోసాల పై కేసుల నమోదుకు ముందే ఆయన ఈ విమానంలో విదేశాలకు పరారయ్యాడు. ఈ ఏడాది మార్చి 7న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈడీ ఈ విమానాన్ని జప్తుచేసింది.
ఈ విమానం నిర్వహణ ఖర్చు అధికమవడంతో వేలం వేసేందుకు నవంబర్ 20న అడ్జుడికేటింగ్ అథారిటీ అనుమతి ఇచ్చింది. ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 9న జరిగే వేలంలో పాల్గొనాలని ఈడీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఈ-వేలం సంస్థ ఎంఎస్టీఈ లిమిటెడ్ నిర్వహించే ఈ వేలంలో ఔత్సాహికులు MSTC/HYD/Directorate of Enforcement/3/Hyderabad/25-26/45608 అనే లింకు ద్వారా పాల్గొనాలని సూచించారు.