హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టించాయి. భూదాన్ భూముల వ్యవహారంలో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. హైదరాబాద్ పాతబస్తీలోని పలువురి ఇండ్లలో సోమవారం ఉదయం నుంచే సోదాలు ప్రారంభమయ్యాయి. మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసా, సర్ఫాన్, షుకూర్ భూదాన్ భూములను ఆక్రమించడంతోపాటు లే-అవుట్ వేసి వాటిని అమ్మినట్టు తెలియడంతో ఈడీ తనిఖీలు చేపట్టింది.
సోదాల్లో అధికారులు పలు కీలక పత్రాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దాదాపు 50 ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతమవడంపై ఇప్పటికే విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. ఆ విచారణ నివేదిక ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా గతంలో ఐఏఎస్ అమోయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.