మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇండ్లు, ఆఫీసుల్లో జరిపిన సోదాల్లో భారీగా నగదును గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లగ్జరీ వాచీల స్మగ్లింగ్, యూరో ఎగ్జిం బ్యాంకు గ్యారెంటీలు, టీడీఎస్ ఎగవేత, అక్రమాస్తులు, రాఘవ కన్స్ట్రక్షన్స్, ఎలక్ట్రిక్ కంపెనీల లావాదేవీల వ్యవహారం.. ఇలా సుమారు రూ.870 కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రెండు రోజులపాటు మంత్రి పొంగులేటి నివాసాలు, ఆఫీసులపై జరిగిన సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని, వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అనేక కంపెనీలు ఉండటం, అనేక మార్గాల్లో లావాదేవీలు జరగడంతో ఎంతమేర అక్రమాలు జరిగాయనేదానిపై తుది నిర్ధారణకు రాలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు.
అందుకే ఈడీ నుంచి ఇప్పటివరకు అధికారికంగా నోట్ విడుదల కాలేదని అంటున్నారు. మరోవైపు.. సోదాల్లో భారీగా సొమ్ము పట్టుబడి ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ఎక్కడ రెయిడ్ చేసినా రూ.కోట్ల నగదు దొరికిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఇంత భారీస్థాయిలో దొరికిన నగదు ఎక్కడిది? మంత్రి ఇంటి వరకూ ఎలా వచ్చింది? ఈ మొత్తాన్ని ఎక్కడికి పంపుతున్నారని నిగ్గు తేల్చే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు.
కొన్ని రాష్ర్టాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక ఆధారంగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ అధికారులు శుక్రవారం జరిపిన సోదాల్లో కీలక సమాచారం దొరకగా.. శనివారం కూడా అత్యంత రహస్యంగా, ఎలాంటి భద్రత లేకుండా మరో రెండు చోట్ల సోదాలు చేపట్టారు. అయితే, సోదాలు ఎక్కడ జరిగాయన్నది మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. సోదాలు ఇటు హైదరాబాద్‌తోపాటు మరొకటి ఖమ్మంలోని రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీసులో జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, శుక్రవారం జరిపిన సోదాల సందర్భంగా మూడు నగదు లెక్కింపు యంత్రాలను తీసుకెళ్లిన అధికారులు.. దొరికిన డబ్బుపై పంచనామా పూర్తిచేసి, సంతకాలు చేయించుకున్నారని తెలిసింది.
బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీసు నుంచి జరిగిన తరలింపులపై ఈడీ దృష్టి సారించినట్టు తెలిసింది. రాఘవ ప్రైడ్లోని కీలకమైన డాక్యుమెంట్లు, నగదు, ఇతర ఎలక్ట్రానిక్, డిజిటల్ సామగ్రిని కార్లలో తరలించిన విషయం శనివారం పలు దినపత్రికల్లో రావడంతో హైదరాబాద్ ఈడీ అధికారులు ఆరా తీశారు. ఆ సమాచారాన్ని పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్‌ను ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులకు పంపినట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని జాతీయ మీడియా ప్రతినిధుల ద్వారా కూడా పలు వివరాలు సేకరించినట్టు సమాచారం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ఏ సోదాలైనా ‘రాఘవ ప్రైడ్’ అత్యంత కీలకమనే అంశాన్ని ఆలస్యంగా తెలుసుకున్నామని.. ఈడీ అధికారులు జాతీయ మీడియా ప్రతినిధులకు చెప్పినట్టు తెలిసింది. అయితే, రెండ్రోజుల ఈడీ సోదాలపై అధికారులు ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిసింది.
ఈడీ సోదాలు శనివారం కూడా కొనసాగుతాయని తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. అర్ధరాత్రి వరకూ జూబ్లీహిల్స్‌లోని ఇంటికి గాని, అటు హిమాయత్‌సాగర్‌లోని ఫామ్‌హౌజ్‌కు వెళ్లలేదని తెలిసింది. మినిస్టర్ క్వార్టర్స్‌కు, సచివాలయానికి తప్ప.. మంత్రి పొంగులేటి ఎక్కడికీ వెళ్లలేదని అధికారులు పేర్కొన్నారు. సచివాలయంలో శనివారం జరిగిన పలు సమావేశాల్లో మంత్రి పొంగులేటి ముభావంగా కనిపించారని చెప్తున్నారు. సోదాలు జరిగిన ప్రతిసారి, అదే రోజు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందో పొంగులేటి చెప్పేవారు. రెండ్రోజుల తనిఖీలు పూర్తయినా కూడా ఆయన మీడియా ముందుకు రాకపోవటం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నదని కాంగ్రెస్‌లోని ఆయన వ్యతిరేక వర్గం వ్యాఖ్యానించింది. ఈడీ సోదాలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, అద్దంకి దయాకర్ మినహా ఏ ఒక్కరూ స్పందించలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఈ దాడులపై పెదవి విప్పలేదు.