Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంలో నంబర్-2 ఎవరంటే చాలామంది చెప్పే పేరు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిదే. కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాత్రను తెలంగాణలో పొంగులేటి పోషిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికలన్నీ పొంగులేటి ఆధ్వర్యంలోనే జరిగాయి. దీనిని బట్టే అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో పొంగులేటి ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. కానీ, పొంగులేటికి కష్టం వస్తే కాంగ్రెస్ పెద్దలు లైట్ తీసుకున్నారు. ఈడీ వరుసగా రెండు రోజులు పొంగులేటి ఇండ్లు, కార్యాలయాలపై దాడులు చేస్తే కనీసం ఢిల్లీ నుంచి ఖండించలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సహచర మంత్రులు సైతం ముఖం చాటేసినట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ అంశం ఇప్పుడు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది. ఇతర రాష్ర్టాల్లోని కాంగ్రెస్ నేతలు, ఆప్ వంటి కూటమి నేతలపై ఈడీ, సీబీఐ దాడులు జరిగితే కాంగ్రెస్ అగ్రనేతలు దర్యాప్తు సంస్థలు, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడతారు. కానీ, పొంగులేటి విషయం లో సైలెంట్‌పై చర్చ జరుగుతున్నది.
నేషనల్ హెరాల్డ్ కేసులో 2022లో సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని ఈడీ విచారించినప్పుడు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు హడావుడి చేశాయి. డీకే శివకుమార్, చిదంబరం, కార్తి చిదంబరం వంటి ఎంతోమంది కాంగ్రెస్ నేతలు, వారి సన్నిహితులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టిన సందర్భాల్లో సైతం కాంగ్రెస్ అగ్రనేతలు స్పందించారు. 2020 జూలైలో నాటి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఇంట్లో ఈడీ సోదాలు జరిగితే, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవా లా తీవ్రంగా ఖండించారు. ఆమ్ఆద్మీపార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా వంటి నేతలపై దాడుల సందర్భంలోనూ సంఘీభావం ప్రకటించింది. కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్లో, బయట ధర్నాలు చేసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ సమయంలోనూ కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్షగా రాహుల్‌గాంధీ అభివర్ణించారు.
ఈ ఏడాది ఆగస్టులో అదానీ-సెబీ చైర్పర్సన్ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఈడీ ఆఫీస్‌కు వెళ్లి ధర్నా చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాంటిది సహచర మంత్రిపై ఈడీ దాడులు జరిగితే సీఎం ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొందరు మంత్రులు సైతం ఇదే బాటలో మౌనాన్ని ఆశ్రయించడం కూడా చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ పెద్దలు కావాలనే పొంగులేటిని లైట్ తీసుకున్నారా? అని చర్చించుకుంటున్నారు.