హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం నగరంలోని ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. వీరిద్దరిపై విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో బోయిన్‌పల్లిలోని మాధవరెడ్డి, ఐఎస్ సదన్‌లోని చీకొటి ప్రవీణ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. వీరు నేపాల్‌లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ నుంచి నుంచి పేకాట రాయుళ్లను ప్రత్యేక విమానాలలో తీసుకెళ్లి క్యాసినో ఆడిస్తున్నట్లు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా వెస్ట్ బెంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్‌పోర్టుకు కస్టమర్లను తరలించి.. అటునుంచి నేపాల్‌లోని హోటల్ మెచి క్రౌన్‌లో ఆల్ ఇన్ క్యాసినో పేరుతో ఈవెంట్ నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. ఈ ఈవెంట్లో టాలీవుడ్, బాలీవుడ్, నేపాలీ డ్యాన్సర్లతో కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేయించారు.
శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, నేపాల్‌లో క్యాసినో నిర్వహించి, ప్రైజ్‌మనీని హవాలా రూపంలో చెల్లించారు. వారంపాటు అక్కడే ఉండి క్యాసినో ఆడేందుకు ఒక్కో కస్టమర్ నుంచి రూ.3 లక్షల రూపాయలు వసూలు చేశారని,నాలుగు రోజుల ప్యాకేజీలో భాగంగా ప్లాన్ టారిఫ్‌లు సైతం అందించారు. నేపాల్‌తో పాటు ఇండోనేషియాలోనూ క్యాసినో ఈవెంట్లు నిర్వహించినట్లు తేలింది. దీంతో.. ఫెమా నిబంధనల కింద కేసు నమోదు చేసింది ఈడీ. కాగా, గుడివాడతోపాటు హైదరాబాద్ క్యాసినో ఆడిస్తూ చికోటి ప్రవీణ్ గతంలో పట్టుబడ్డాడు.