హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : బ్యాంకులను మోసం చేసిన కేసులో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, టెలిట్రానిక్స్ సంస్థల్లో హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్‌లో ఈడీ సోదాలు చేపట్టింది. బెంగళూరులో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్‌పై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ టెలిట్రానిక్స్ డైరెక్టర్లు, భాగస్వాములు రాఘవేంద్ర, రవికుమార్ ఇండ్లలో సోదాలు చేపట్టారు.
వీరు గతంతో యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.101.48 కోట్ల రుణాన్ని దుర్వినియోగం చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించి సీబీఐకి ఫిర్యాదు చేశారు. రామకృష్ణ గ్రూప్ ట్రేడింగ్ కంపెనీ సెల్ఫోన్ల మార్కెటింగ్ ముఖ్యంగా సోనీ/శాంసంగ్ ఉత్పత్తుల వ్యాపారంలో పేరుగాంచింది. ఈ సోదాల సందర్భంగా డైరెక్టర్లు, భాగస్వామ్యులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లో రూ.1.45 కోట్ల నగదు ఫ్రీజ్ చేశారు. విదేశీ చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.