Heera Gold | హీరాగోల్డ్ కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ముగిసింది. కుంభకోణంలో ఈడీ సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల దాడులు నిర్వహించింది. వేకువ జాము నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్‌తో పాటు ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంలో ఒకేసారి ఐదు చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హీరో గోల్డ్ చీఫ్ నౌహీరా షేక్ రూ.400 కోట్ల వరకు అక్రమంగా సంపాదించినట్లుగా సోదాల్లో గురించినట్లు అధికారులు పేర్కొన్నారు.
నౌహీరా షేక్ పలు స్కీమ్‌ల పేరుతో రూ.వేలకోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించి.. ఎంతో మందిని మోసగించారన్న ఆరోపణలతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సోదాల సమయంలో భారీగా ఆస్తి పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.90లక్షల నగదు, 12 కొత్త లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.25కోట్ల విలువ ఉన్న బినామీ ఆస్తులకు సంబంధించిన పేపర్లు, నౌషిరా షేక్ పేరిట ఉన్న మరో 13 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని.. ఆమెను అరెస్టు చేసినట్లు వివరించారు. హీరాగోల్డ్ వ్యవహారంలో నౌషీరా షేక్‌పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే.