హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛ్ బయో కంపెనీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంపై వెంటనే విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లి ఈడీ డైరెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన తమ్ముడు ఎనుముల జగదీశ్‌రెడ్డితో అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన ఒప్పందంపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ ఆధారాలు కూడా సమర్పించినట్టు తెలిపారు. అధికారులు తన ఫిర్యాదును స్వీకరించి ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ను మీడియాకు చూపించారు. క్రిశాంక్ లేఖ పూర్తి సారాంశం ఇలా ఉంది.. ‘2024 ఆగస్టు 6న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఎనుముల రేవంత్‌రెడ్డి (తెలంగాణ ముఖ్యమంత్రి), స్వచ్ఛ్ బయో కంపెనీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని మీ దృష్టికి తేవాలని అనుకుంటున్నాం. స్వచ్ఛ్ బయో ఇద్దరు డైరెక్టర్లలో ఒకరు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలో నమోదైన ఎనుముల రేవంత్‌రెడ్డి సోదరుడు ఎనుముల జగదీశ్‌రెడ్డి కావడం ఆందోళన కలిగిస్తున్నది. డైరెక్టర్ ఎనుముల జగదీశ్‌రెడ్డి కరస్పాండెన్స్ చిరునామా ‘ఫిలడెల్ఫియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’ అని ఉంది.
దీనిని మీరు గమనించాలి. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సీఎం కుటుంబ సభ్యులు వ్యాపారం చేయడాన్ని సమర్థించారు. అధికారిక పర్యటనలో సీఎం స్వయంగా ఓ కంపెనీతో వ్యాపారాన్ని ప్రకటిస్తుంటే అది ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇం ట్రెస్ట్ అండ్ క్విడ్ ప్రోకో’లా అనిపిస్తుంది. సీ ఎం ఫిలడెల్ఫియా పర్యటనకు కేవలం 15 రోజుల ముందు కంపెనీని విలీనం చేయడం ఇక్కడ గమనార్హం. ఆ కంపెనీ జూబ్లీహిల్స్, హైదరాబాద్ చిరునామాతో ఎంసీఏలో రిజిస్టర్ చేయబడింది. అయితే, అమెరికాలో ఈ కంపెనీని ప్రకటించడం యొక ఉద్దేశం ఏమి టి? ఇందులో విదేశీ నిధుల ప్రమేయం ఉం దా? మనీలాండరింగ్‌తో ఏదైనా సంబంధం ఉందా? జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో అధికారికంగా నమోదు చేసిన కార్యాలయంలో కంపెనీ పేరు, కనీసం బోర్డు కూడా లేదు. ఇది కార్పొరేట్ చట్టాన్ని ఉల్లంఘించడమే. ముఖ్యమంత్రి రేవంత్ ఎంవోయూపై సంతకం చేస్తున్న చిత్రంలో సీఎం తమ్ముడితో పాటు హర్ష పసునూరి అనే వ్యక్తి ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన వ్యాపార లబ్ధికి తన సోదరుడు జగదీశ్‌తో ఎంవోయూపై సంతకం చేయడం అతిపెద్ద అధికార దుర్వినియోగం. మా విజ్ఞప్తిని ఫిర్యాదుగా స్వీకరించి, స్వచ్ఛ్ బయో డైరెక్టర్లతో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపై విచారణ జరిపించాలని ఫిర్యాదులో కోరారు.
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి తన సోదరుడు జగదీశ్వర్‌రెడ్డికి చెందిన స్వచ్ఛ్‌బయో కంపెనీతో చేసుకున్న ఒప్పందం ఇప్పుడు జాతీయస్థాయిలోనూ చర్చనీయాంశమైంది. తన సొంత తమ్ముడితో కంపెనీ పెట్టించి దానితో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం ఒప్పందం చేసుకోవడం విడ్డూరంగా ఉందం టూ జాతీయ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. అసలు స్వచ్ఛ్ బయో కంపెనీ ఎవరిది? దాని పుట్టుపూర్వత్తరాలపై ‘సీఎన్ఎన్’ చానల్ ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. 15 రోజుల క్రితమే ఏర్పాటైన కంపెనీతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఒప్పందం ఎలా చేసుకున్నదని ‘ఇండియా టుడే’ ప్రత్యేక కథనంలో ప్రశ్నించింది. ‘మనీ కంట్రోల్’ కూడా సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి, స్వచ్ఛ్ బయో కంపెనీ తరఫున ఆయన తమ్ముడితో చేసుకున్న ఒప్పందాలపై వార్తలను ప్రసారం చేసింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ‘ఐఏఎన్ఎస్’ కూడా దీనిపై కథనాలు రాసుకొచ్చింది.