హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి దృష్టిసారించింది. ఈ మేరకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదును నాంపల్లి ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టు ఈడీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
అగ్రిగోల్డ్ అనుబంధ కంపెనీలైన అగ్రి గోల్డ్ ఎగ్జిమ్స్, అమృతవర్షిణి డెయిరీ ఫామ్స్, అవ్వాస్ ఇన్ఫోటెక్, మాతంగి ఇన్ ఫ్రా వెంచర్స్, శక్తి టింబర్ ఎస్టేట్స్, అవ్వా సీతా రామారావు, అవ్వా వెంకట సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, శాంక్చురీ హోమ్స్‌పై ఈ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు చేసింది. గతంలో అగ్రి గోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్ అండ్ నికోబార్ సహా పలు రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన అనేక ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పేరిట దాదాపు 19 లక్షల మంది కస్టమర్లు, 32లక్షల మంది ఖాతాదారుల నుంచి అధిక రాబడి, రెసిడెన్షియల్ ప్లాట్ల పేరుతో డిపాజిట్లు సేకరించినట్టు ఈడీ పేర్కొన్నది. రియల్ ఎస్టేట్ ముసుగులో మోసపూరిత కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ సీమ్‌ను నడుపుతున్నట్టు ఈడీ తేల్చింది. 130కంటే ఎకువ కంపెనీలు డిపాజిటర్ల నుంచి ప్లాట్లకు అడ్వాన్స్‌లుగా కోట్లాది రూపాయలను సేకరించినట్టు గుర్తించారు.
అవ్వా వెంకట రామారావు నేతృత్వంలోని అగ్రి గోల్డ్ గ్రూప్ అండ్ ఇతర డైరెక్టర్లు వేలాదిమంది కమీషన్ ఏజెంట్లను నియమించుకొని.. లక్షలాది మంది నుంచి డిపాజిట్లు సేకరించారు. అయితే, డిపాజిటర్లకు తెలియకుండానే ఈ నిధులు పవర్/ఎనర్జీ, డెయిరీ, ఎంటర్టైన్మెంట్, హెల్త్ (ఆయుర్వేద), ఫామ్ ల్యాండ్ వెంచర్స్ వంటి వివిధ పరిశ్రమలకు మళ్లించినట్టు గుర్తించారు.