రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల స్వాహాకు కబ్జాదారులు కుట్ర పన్నినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేల్చింది. పకా ప్రణాళికతో పన్నాగం పన్నారని ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేరొంది. తప్పుడు వారసత్వ, ఫోర్జరీ పత్రాలను ఆమోదించి రికార్డుల్లో నమోదు చేసి విక్రయించేందుకు కుట్ర చేసినట్టుగా బహిర్గతం చేసింది. తప్పుడు రికార్డుల్లో నమోదుకు అవకాశాలు కల్పించడం వెనుక ప్రైవేట్ వ్యక్తులతోపాటు రాష్ట్ర అధికారుల పాత్ర ఉన్నదని వెల్లడించింది. ప్రైవేట్ వ్యక్తులతోపాటు తహసీల్దార్, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల పాత్ర ఉన్నదని పేరొన్నది. తదుపరిదర్యాప్తులో మరికొందరు అధికారుల పాత్ర బట్టబయలు కావచ్చునని వెల్లడించింది.
హైదరాబాద్ జూన్ 14 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల స్వాహాకు కబ్జాదారులు కుట్ర పన్నినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. అధికారుల అండతో సర్వే నం.181, 182కు సంబంధించి భూముల స్వాహాకు యత్నించినట్టు దర్యాప్తులో తేలిందని ఈడీ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో పేరొంది. నాగారంలోని సర్వే నం.181, 182, 194, 195ల్లో భూదాన్ భూముల్లో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉన్నతాధికారులకు ఫిబ్రవరి, మార్చిల్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేశ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి, ఈడీతోపాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి బంధువులకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించడంతో ఈడీ తరపున అసిస్టెంట్ డైరెక్టర్ గజరాజ్‌సింగ్ ఠాకూర్ కౌంటర్ దాఖలు చేశారు. 2023 మార్చి 13న మహేశ్వరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఈడీ వివరించింది.
దర్యాప్తులో సర్వే నం. 181, 182లోని 103 ఎకరాలు నవాబ్ హాజీఅలీఖాన్కు చెందినది కాగా, తన కుమారులైన ఫరూక్ అలీఖాన్, అక్బర్ అలీఖాన్‌లకు కానుకగా కొంత ఇవ్వగా 50 ఎకరాలు భూదాన్ బోర్డుకు ఇచ్చారని తెలిపింది. అయితే నవాబ్ కుమార్తె ఖాదరున్నీసా, ఆమె కుమారుడు మునావర్ ఖాన్‌తోపాటు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అబ్దుల్ అఖ్తర్, మహమ్మద్ అబ్దుల్ షుకూర్, ఎం చంద్రయ్య తదితరులు కుట్రకు తెరతీసినట్టు తెలిపింది. నవాబుకు ఇద్దరు కుమారులు ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నప్పటికీ తాను ఒకరే వారసురాలుగా ఆమె సమర్పించిన అఫిడవిట్‌ను ఎమ్మార్వో పరిగణనలోకి తీసుకొని ధరణిలో నమోదు చేశారన్నారని పేర్కొంది. వీరందరూ కలిసి 2017లో భూదాన్ యజ్ఞ బోర్డు డీనోటిఫై చేసినట్టు నకిలీ, ఫోర్జరీ లేఖను సృష్టించి అధికారులకు సమర్పించారు. వాస్తవంగా ఇది భూదాన్ భూమిగా రికార్డుల్లో ఉన్నప్పటికీ కుట్రలో భాగంగా అధికారులు డీనోటిఫై చేశారు. 1956లో నవాబ్ హాజీఅలీఖాన్ 50 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చే లేఖను తహసీల్దార్‌కు అప్పగించారు. దీన్ని తహసీల్దార్ ఆమోదించి 1995లో నిషేధిత జాబితాలో చేర్చారు. సర్వే నం.81లో మిగిలిన భూమిని గైరాన్ సరారి భూములుగా ప్రభుత్వం ప్రకటించింది.
నవాబ్ హాజీఅలీఖాన్ 57 ఎకరాలను సర్వే నం.181/1, 2, 3, 5, 6, 182లో అక్బర్ అలీఖాన్, ఫరూఖ్ అలీఖాన్‌కు 1967-68లో మౌఖికంగా కానుకగా ఇవ్వగా, భూసంసరణల ట్రిబ్యునల్ దీన్ని ఆమోదించింది. ఈ భూమిని నవాబు కుమారులు 2005లో దస్తగిరి షరీఫ్‌కు, ముజాఫర్ హుస్సేన్‌కు విక్రయించారు. 2006లో నవాబ్ మృతి చెందారు. ఆ తర్వాత తొమ్మిది ఏండ్లకు ఒకసారిగా సర్వే నం.181, 182లో భూమిని తండ్రి కానుకగా ఇచ్చారంటూ తప్పుడు పార్టిషన్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ పొందారు. దీన్ని ఆమోదించిన అధికారులు వారసత్వ, పాస్‌బుక్ జారీచేశారు. మ్యుటేషన్ కూడా కావడంతో ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేశారు. నకిలీ పత్రాలను సమర్పించిన ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వ అధికారులు కుమ్మకై డీనోటిఫై చేశారు. వారసత్వం, డీనోటిఫికేషన్, మ్యుటేషన్‌కు అనుమతించడం, విక్రయానికి ఒప్పందాల్లో అధికారుల పాత్రపై వాంగ్మూలాలను ఈడీ రికార్డు చేసింది. ఇతర శాఖల నుంచి సమాచారం వచ్చాక అధికారులను మరోసారి విచారిస్తామని తెలిపింది. కుట్రలో భాగంగా ఫోర్జరీ పత్రాలు సమర్పించిన ఈ భూదాన్ భూభాగోతం విజయవంతంగా అమలుచేయడం వెనుక, తప్పుగా వారసత్వాన్ని అంగీకరించి ఆమోదించడం వెనుక గత తహసీల్దార్, కలెక్టర్ల పాత్ర ఉన్నట్టు పేర్కొంది. ఈ ప్రక్రియలో అధికారులు కీలకపాత్ర పోషించారని, ఇంకా దర్యాప్తు కొనసాగాల్సి ఉన్నదని ఈడీ నివేదించింది.
షుకూర్ కుటంబం కొనుగోళ్లు అబద్ధం
సర్వే నం.194, 195లోనూ అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. సర్వే నం. 181, 182లపై మహేశ్వరం పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడంతో తాము కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపింది. అయితే, 194, 195 సర్వే నంబర్లకు సంబంధించి మహేశ్వరం పోలీసులు ఏ విధమైన ఎఫ్ఐఆర్నూ నమోదు చేయలేదని తెలిపింది. దీంతో తాము కూడా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయలేదని వివరించింది. పిటిషనర్ మల్లేశ్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు వెల్లడించింది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదు కాపీని గత నవంబర్‌లో డీజీపీకి పంపినట్టు వివరించింది. ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పింది. సర్వే నం.194లో అబ్దుల్ షుకుర్, కుటుంబసభ్యులు నవాబ్ హాజీ అలీఖాన్ నుంచి కొనుగోలు చేసినట్టు రికార్డులు చూపిస్తున్నాయని తెలిపింది. అయితే నవాబు నుంచి కొనుగోలు చేసిన అబ్దుల్ షుకూర్ బంధువుల్లోని వారికి 11, 6, 2 ఏండ్ల వయస్సు ఉండటంపై సందేహాలు ఉన్నాయని ఈడీ చెప్పింది.
ఇప్పటికే తప్పుడు డాక్యుమెంట్లతో కొనుగోలు వ్యవహారాలకు సంబంధించి అబ్దుల్ షుకూర్‌పై రెండు కేసులు నమోదయ్యాయని గుర్తు చేసింది. 1957-58లో నవాబ్ హాజీ అలీఖాన్‌కు సర్వే నం. 181, 182, 194, 195లో 779.7 ఎకరాలుండగా 564.91 ఎకరాలను కౌలుదారులకు విక్రయించారని తెలిపింది. సర్వే నం. 195లో 38.24 ఎకరాలు, మరో 57.22 ఎకరాలు జబర్దస్త్ఖాన్కు, మహమ్మద్ ఆలమఖాన్కు విక్రయించారని ఈడీ వివరించింది. 103 ఎకరాలను కుమారులకు, భూదాన్ బోర్డుకు కానుకగా ఇచ్చారని, 1992కు ముందే నవాబు భూమిని అంతా విక్రయించి, పంపిణీ కూడా చేశారని, కాబట్టి 1992లో అబ్దుల్ షుకూర్ కుటుంబసభ్యులు కొనుగోలు చేశారన్నది నిజం కానట్టు స్పష్టమవుతున్నదని వివరించింది. తప్పుడు మ్యుటేషన్ వల్ల 11 భూ లావాదేవీలు జరిగాయి. దీనివల్ల ప్రభుత్వానికి రూ.17.5 కోట్ల మేరకు నష్టం జరిగింది. భూమి ప్రైవేట్ బిల్డర్ల వశం అయ్యింది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి భూదాన్ భూములు వెళ్లాయి. కోట్ల రూపాయల విలువైన భూధాన్ బోర్డ్ భూముల అన్యాక్రాంతం వెనుక ఉన్న వారి బాగోతాలను బట్టబయలు చేయడానికి మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది.. అని ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో హైకోర్టుకు వివరించింది.
17.5 కోట్ల నష్టంపై ఎఫ్ఐఆర్
దస్తగిరి షరీఫ్ ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పోలీసులు 2023 మార్చి 13న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఖాదరున్నీసా, మహమ్మద్ మునావర్‌ఖాన్, బొబ్బిలి దామోదర్‌రెడ్డి, బొబ్బిలి విశ్వనాథరెడ్డి, ఎన్ సంతోష్‌కుమార్, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి మోసపూరితంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కేసు నమోదైంది. గత మండల రిజిస్ట్రార్ ఆర్పీ జ్యోతి సహకారంతో విక్రయాలు చేశారని ఫిర్యాదుదారు పేరొన్నారు. నవాబ్ హాజీ అలీఖాన్ నుంచి కానుకగా పొందిన కుమారులు మహమ్మద్ అక్బర్ అలీఖాన్, మహమ్మద్ ఫరూఖ్ అలీఖాన్ నుంచి వీరిద్దరు భూమి కొనుగోలు చేశారు. అయితే 2006లో అప్పటి ఏపీ ప్రభుత్వం సర్వే నం.181లో మొత్తం భూమి భూదాన్ భూములుగా నోటిఫై చేయగా దస్తగిరి హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు.
వారసురాలుగా ఖాదరున్నీసా, ఆమె కుమారుడు మునావర్ ఖాన్ 10.12 ఎకరాలు విక్రయించగా దస్తగిరి సివిల్ సూట్ దాఖలు చేసి ఇంజంక్షన్ ఉత్తర్వులు పొందారు. ఖాదరున్నీసా, మునావర్ మోసపూరితంగా మ్యుటేషన్ చేయించుకుని 11 విక్రయ ఒప్పందాలు చేశారు. ప్రభుత్వ భూమిగా నోటిఫై అయిన 40 ఎకరాలను విశ్వనాథ్‌రెడ్డి, ఎన్ సంతోష్‌కుమార్‌కు రూ.13.57 కోట్లుకు విక్రయించారు. వీరిద్దరు ఈ భూమిని రూ.17.50 కోట్లకు ఈపీఐఎల్కు విక్రయించారు. కుట్రలో భాగంగా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమి ప్రైవేటు బిల్డర్ పరమైంది. వీరి కుట్రతో రూ.17.50 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం జరిగినట్టు ఎఫ్ఐఆర్ నమోదైంది.