హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): భూదాన్ భూముల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. గురువారం కమ్యూనిస్ట్ నాయకుడు, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు.
భూదాన్ భూముల పరిరక్షణ కోసం గతంలో శంకర్ నాయక్ పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు మరింత సమాచారం కోసం శంకర్ నాయక్‌ను కలిశారు.
ఈ భూముల వ్యవహారంలో ఇటీవల ఖదీరున్నీసా, మునావర్ ఖాన్, లతీఫ్, షర్ఫాన్, అక్తర్ షర్ఫాన్, షుకూర్ నుంచి నకిలీ పత్రాలు, రూ. 23 లక్షల నగదు, 12 వేల విదేశీ కరెన్సీని, మునావర్‌ఖాన్ ఫాం హౌస్‌లో 45 వింటేజ్ కార్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం విధితమే. మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామంలో 104 ఎకరాల భూదాన్ భూముల అక్రమ విక్రయాలపై ఈడీ దర్యాప్తు జరుపుతున్నది. ఈ భూములు భూదాన్ యజ్ఞ బోర్డుకు చెందినవి.