హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): చైనా లోన్ యాప్స్‌పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో ‘పెద్ద చేప’ను పట్టుకొన్నారు. మొబైల్ యాప్స్ ద్వారా అధిక వడ్డీకి వ్యక్తిగత రుణాలు ఇవ్వడంతోపాటు, నిబంధనలకు విరుద్ధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీని స్థాపించాడన్న ఆరోపణలపై కుడోస్ ఫైన్సాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, సీఈవో పవిత్రప్రదీప్ వాల్వేకర్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్టు ఈడీ వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా కుడోస్ ఆధ్వర్యంలో 39 యాప్‌లను సృష్టించారని, వాటి ద్వారా రుణాలిచ్చి ప్రజలను మోసగించారని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కంపెనీ రూ.10 కోట్ల మేర వ్యాపారం చేసేందుకే అనుమతి పొందినప్పటికీ రూ.2,224 కోట్ల వ్యాపారం చేసినట్టు తెలుస్తున్నది.