తెలంగాణచౌక్ (కరీంనగర్) : దేశ సంపదను దోచుకున్న ఆదానీ కంపెనీ(Adani companies) ల మోసాలపై కేంద్ర ప్రభుత్వం ఈడీ(ED), సీబీఐ(CBI), ఐటీ(IT) సంస్థలతో దాడులు చేయించాలని అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. కరీంనగర్లోని శ్వేత హోటల్లో జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, జిల్లా కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని పేదల సంపద పెద్దల చేతుల్లోకి పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
తమ అనుకూల కార్పొరేట్ శక్తులైన ఆదానీ, అంబానీలకు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), హోం మంత్రి అమిత్షా (Amit shah)అప్పనంగా దోచిపెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో అతి తక్కువ సమయంలో ప్రపంచ కుబేరుడిగా ఆదానీ ఎదగడానికి పరోక్షంగా మోదీ, అమిత్షా సహకారం ఉందని ఆరోపించారు. పేద ప్రజలు ఒక్కో రూపాయి పోగేసి ఎల్ఐసీ(LIC), ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకున్న రూ.2లక్షల కోట్లను రుణాల రూపంలో ఆదానీ కంపెనీలను కట్టబెట్టారన్నారు.
ఇటీవలి కాలంలో ఆదానీ కంపెనీ మోసాలపై హిడెన్ బర్గ్(Hidenburg) కథనం రాయడంతో ఆదానీ గ్రూప్ రూ.10లక్షల కోట్ల దాకా నష్టపోయిందని పేర్కొన్నారు. దీంతో ఎల్ఐసీ, బ్యాంకులు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. పేద ప్రజలు దాచుకున్న డబ్బును ఆదానీ గ్రూప్లో పెట్టుబడులుగా ఎలా పెడతారని, రుణాలుగా ఎలా ఇస్తారని మండిపడ్డారు. విపక్ష రాష్ట్రంలో మంత్రులు, రాజకీయ నాయకుల మీద దాడులు చేపిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఆదానీ కంపెనీల మీద ఎందుకు దాడులు చేయించడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మత విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు. ఆ పార్టీకి ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో పతనం మొదలైందని చెప్పారు. యూనివరిట్సీ, కాలేజీలో ఎదురయ్యే సమస్యలను విద్యార్థులు పోలీసులకు, ప్రజా సంఘాలు, మీడియాకు తెలియజేసి పరిష్కరించుకోవాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. బైరి నరేశ్ మీద పోలీసు సమక్షంలో దాడులు చేసిన ఆర్ఎస్ఎస్ గుండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు సుద్దాల లక్ష్మణ్, కొండ్ర సంపత్, ఉపాధ్యక్షుడు ఆనంద్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్కే సుల్తాన పాల్గొన్నారు.