హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 12 సర్యూట్లలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించినట్టు అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. శనివారం సచివాలయంలోని అటవీ మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఎకో టూరిజం కన్సల్టేటివ్ కమిటీ ఉన్నతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. అడ్వెంచర్, రిక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ వైల్డ్‌లైఫ్, హెరిటేజ్-కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని ఎకో టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఎకో టూరిజం పాలసీ రూపకల్పనలో అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పర్యాటకశాఖలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ టూరిజం స్పాట్ల అభివృద్ధికి పబ్లిక్-ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో నిధులను సమీకరించాలని ఆదేశించారు. సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) పర్గెయిన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ఆషాడ బోనాల నిర్వహణకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.20 కోట్లను మంజూరు చేశారని దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. శనివారం తన చాంబర్లో జీహెచ్ఎంసీ పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా తనతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, డీ శ్రీధర్‌బాబు, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యులుగా, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా బోనాల ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇతర ప్రధాన ఆలయాలకు ఉత్సవ కమిటీల ఎంపిక ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు.